Controversy over the construction of an outpost అవుట్ పోస్టు నిర్మాణంపై వివాదం
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:22 AM
Controversy over the construction of an outpost అవగాహన రాహిత్యం, సమన్వయలోపం, ఎవరికి వారు తమ మాటే నెగ్గాలి అనే పంతంతో టౌన్ ప్లానింగ్ విభాగం, పోలీసుల మధ్య సాగుతున్న గొడవ నగరంలో చర్చనీయాంశంగా మారింది.
అవుట్ పోస్టు నిర్మాణంపై వివాదం
పోలీస్ వర్సెస్ టౌన్ ప్లానింగ్!
విజయనగరంలో రెండు శాఖల మధ్య వివాదం
ఔట్‌పోస్టు నిర్మాణానికి పోలీసుల దరఖాస్తు
అంతలోనే హెల్ప్ డెస్క్ పనులు ప్రారంభం
అక్రమ కట్టడమని కూల్చివేసిన మునిసిపల్ సిబ్బంది
టౌన్‌ప్లానింగ్ విభాగానికి వెళ్లిన పోలీసులు
ఇరువురి మధ్య వాగ్వాదం
అవగాహన రాహిత్యం, సమన్వయలోపం, ఎవరికి వారు తమ మాటే నెగ్గాలి అనే పంతంతో టౌన్ ప్లానింగ్ విభాగం, పోలీసుల మధ్య సాగుతున్న గొడవ నగరంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అవుట్ పోస్ట్ నిర్మాణంపై తలోమాట చెబుతున్నారు. తాత్కాలిక నిర్మాణం పేరుతో అనుమతి తీసుకున్నామని పోలీసులు అంటుండగా.. అనుమతి ఇవ్వలేదని నగర ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ వివాదం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరింది.
విజయనగరం /టౌన్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని గంటస్తంభాన్ని ఆనుకుని ఉన్న కాలువపై ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి నివారణపై అవగాహన కలిగించేందుకు పోలీస్ హెల్ప్‌డెస్క్(అవుట్ పోస్ట్) నిర్మాణం చేపట్టాలని పోలీసులు శాఖ భావించింది. దీనిపై కార్పొరేషన్ కమిషనర్ బాలాస్వామి నుంచి అనుమతులు కోరుతూ ఈనెల 16న దరఖాస్తు చేశారు. లెటర్‌ను పరిశీలించిన కమిషనర్ స్థలం చూపించిన తరువాత నిర్మాణం చేయాలని తెలిపినట్లు సమాచారం. అయితే అంతవరకు ఆగకుండా లెటర్ పెట్టిన వెంటనే పోలీసులు నిర్మాణం చేపట్టడంతో పట్టణ ప్రణాళికా విభాగం అధికారి అనిత మంగళవారం కట్టడాన్ని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సమాచారం కూడా ఇవ్వకుండా ఎందుకు గోడలను తొలగించారంటూ నేరుగా ప్రణాళికా విభాగానికి వెళ్లి అనితను ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు ఆమె బదులు ఇస్తూ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణం గుర్తించి తొలగించామని, ఏమైనా చెప్పాలనుకుంటే నేరుగా కమిషనర్‌తో మాట్లాడుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అది విన్న పోలీసులు ‘మీపై కేసులు పెడతాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలి’ అన్నారు. ఆమె కూడా ‘నేను మీపై ఫిర్యాదు చేస్తాను’ అని అన్నారు. దీంతో ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ఇంకా కొలిక్కి రాలేదు.
లెటర్ మాత్రమే పెట్టారు
నగరంలో హెల్ప్‌డెస్క్ నిర్మాణానికి అనువైన స్ధలం చూపించాలని కోరుతూ కమిషనర్‌కు ఈ నెల 16న పోలీస్ శాఖ లెటర్ పెట్టింది. అయితే స్థలం చూపించకముందే లెటర్ ఇచ్చిన రోజునే కాలువపై నిర్మాణం చేపట్టడంతో వెళ్లి తొలగించాం. నన్ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. ఇదే విషయం కమిషనర్‌కు చెప్పగా ఎస్పీతో తాను మాట్లాడతానని స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదని తెలిపారు.
- అనిత, పట్టణ ప్రణాళికా విభాగం అదికారి
శాశ్వత నిర్మాణం చేయరాదు
పోలీస్ అవుట్‌పోస్టు కోసం శాశ్వత నిర్మాణం చేపట్టరాదు. చెక్కలతో లేదా తాత్కాలిక మెటీరియలతో నిర్మాణం చేపట్టాలి. శాశ్వత నిర్మాణం చేపట్టడంతో తొలగించాలని ప్రణాళికా విభాగం సిబ్బందికి ఆదేశించాం.
- బాలాస్వామి, కమిషనర్, కార్పొరేషన్
ఎవరమూ ఫిర్యాదులు చేసుకోలేదు
నగరంలోని ట్యాక్సీస్టాండ్ సమీపంలో గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ హెల్ప్‌డెస్క్ నిర్మాణం చేపడుతుండగా పట్టణ టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వచ్చి కూల్చివేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో అటు నగరపాలక సంస్థ అధికారులు కానీ.. ఇటు పోలీసులు కానీ ఎటువంటి ఫిర్యాదులు చేసుకోలేదు. భవిష్యత్‌లో కూడా ప్రభుత్వ అధికారులంతా కలిసి పనిచేయాలి.
- ఆర్వీకే చౌదరి, సీఐ, వన్‌టౌన్, విజయనగరం