Continue in Service విధుల్లో కొనసాగించండి
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:44 PM
Continue in Service గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న తమను విధుల్లోనే కొనసాగించాలని ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
మంత్రి సంధ్యారాణి నివాసం ఎదుట నిరసన
సాలూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ గురుకులాల్లో పనిచేస్తున్న తమను విధుల్లోనే కొనసాగించాలని ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అధికారులతో మాట్లాడి.. న్యాయం చేస్తానని ఆమె చెప్పినా వారు సంతృప్తి చెందలేదు. మంత్రి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి సంధ్యారాణి ఉపాధ్యాయ సంఘ నాయకులు పరమేశు, మల్లికార్జున, బ్రహ్మయ్య తదితరులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ తరువాత గిరిజన విద్యాలయాలకు 2వేల మంది ఉపాధ్యాయులను నియమించా మన్నారు. గిరిజన శాఖ గురుకులంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్రంలో 1448 మంది ఉపాధ్యాయ, అధ్యాపకులుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారిలో 980 మందిని కొనసాగించేం దుకు రంగం సిద్ధం చేశామన్నారు. మిగతా అధ్యాపక, ఉపాధ్యాయులకు సంబంధించి ఖాళీలను బట్టి అర్హత, అనుభవం ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం సంఘ నాయకులు ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులతో మాట్లాడడంతో వారు నిరసన విరమిం చుకున్నారు.