Share News

‘ఉపాధి’ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్ర

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:07 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

 ‘ఉపాధి’ పథకాన్ని ఎత్తేసేందుకు కుట్ర
మాట్లాడుతున్న షర్మిల

జాబ్‌కార్డుల్లో కోతలు పెడుతున్నారు

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

పార్వతీపురం/కొమరాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో ఆదివారం ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రను నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఉపాధి హామీ పథకం స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంతో వేతనదారులకు ఉపాధి లేకుండాపోతుందని అన్నారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకానికి గండి పెడుతున్నాయి. ప్రతి ఏడాదీ జాబ్‌కార్డుల్లో కోతలు పెడుతున్నాయి. వంద రోజులు పని కల్పించాల్సి ఉన్నప్పటికీ సగటున 52 రోజులు కూడా రాష్ట్రంలో పనులు కల్పించడం లేదు. పని గంటలను 12 గంటలు పెంచడం దారుణం. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంటే జగన్‌ ఎందుకు నోరు విప్పడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలవాలి.’ అని షర్మిల కోరారు. తొలుత ఆమెకు పార్టీ శ్రేణులు, గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి షర్మిల థింసా నృత్యం చేశారు. పాధి కూలీలతో మాట్లాడి వేతనాలు అక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రశ్నించగా పలువురు అందడం లేదని ఆమె దృష్టికి తీసుకొని వెళ్లారు. ఆల్ఫాపవర్‌ ప్లాంట్‌ కోసం భూములు తీసుకున్నారని ప్రభుత్వ భూములు కూడా కలపుకొన్నారని ఆమెకు పలువురు ఫిర్యాదు చేశారు. పింఛన్లు అందడం లేదని, ఉపాధిహామీ పథకం పనులకు వెళ్లినప్పటికీ తమకు వేతనాలు అందడం లేదని మరికొందరు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గిరిజనులు తమ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదని షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. కార్య క్రమంలో మాజీ ఎంపీ జేడీ శీలం, కాంగ్రెస్‌ నాయకులు వంగల దాలినాయుడు, మోహన్‌రావు, గేదెల రామకృష్ణ, అడ్డాకుల చిన్నారావు, పి.రంజిత్‌కుమార్‌, గౌరీశంకర్‌, కిరణ్‌కుమార్‌, రవికుమార్‌, సాయి శ్రీనివాస్‌, తిరుపతిరావు, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:07 PM