Share News

Complex Fertilizer రైతుకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు

ABN , Publish Date - Aug 01 , 2026 | 11:23 PM

Complex Fertilizer Woes Haunt Farmers కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఖరీఫ్‌ రైతులకు షాక్‌ ఇస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రెండోసారి వాటి ధరలు పెరగడంతో వారు తలులు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు యూరియాతో పాటు డీఏపీ రేట్లలో ఎటువంటి తేడా లేదు. కానీ కాంప్లెక్స్‌ ఎరువల ధరలే అన్నదాతలకు టెన్షన్‌ పెడుతున్నాయి.

 Complex Fertilizer  రైతుకు ‘కాంప్లెక్స్‌’ కష్టాలు

  • బస్తాకు రూ.150 నుంచి రూ.200వరకు అదనపు భారం

  • ఈ ఖరీఫ్‌ సీజన్‌లో రెండోసారి పెంచిన వైనం

పార్వతీపురం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఖరీఫ్‌ రైతులకు షాక్‌ ఇస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రెండోసారి వాటి ధరలు పెరగడంతో వారు తలులు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు యూరియాతో పాటు డీఏపీ రేట్లలో ఎటువంటి తేడా లేదు. కానీ కాంప్లెక్స్‌ ఎరువల ధరలే అన్నదాతలకు టెన్షన్‌ పెడుతున్నాయి. జిల్లాలో 28-28 రకం ఎరువు 50 కేజీల ధర గతేడాది రూ.1800 ఉండగా ప్రస్తుతం రూ.2,300కు చేరింది. గతంలో రూ.1400 ఉన్న 20-20-0-13 రకం ఎరువు ధర నేడు రూ.2,300 వేలు పలుకుతోంది. 10-26-26 , 14-35-14 , పొటాష్‌ , ఎస్‌ఎస్‌ఈ రకం ధరలు బస్తాపై రూ. 150 నుంచి 200 వరకూ పెరిగాయి. జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం 7,500 టన్నుల నుంచి 8 వేల టన్నుల వరకు ఉంటుంది. ఆర్‌ఎస్‌కేల్లో అంతంతమాత్రంగానే అవి అందుబాటులో ఉండడంతో రైతులు ప్రైవేట్‌ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం.. మరోవైపు పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ధైర్యం చేసి.. ఖరీఫ్‌ పనులు ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు కేవలం 16,600 హెక్టార్లలో మాత్రమే ఉబాలు పూర్తయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లోనే రైతులు వరిసాగు చేపట్టారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు సూచించినా.. చాలామంది వరి సాగుకే మొగ్గు చూపారు. అదేవిధంగా 584 హెక్టార్లలో పత్తి, 73,885 ఎకరాల్లో పామాయిల్‌, 7,531 హెకార్టర్లలో అరటి, 3,786 హెక్టార్లలో జీడి మామిడి, 31,503 హెక్టార్లలో చిరు ధాన్యాలతో పాటు ఇతర పంటల సాగు చేపడుతున్నారు. ‘కొన్ని కాంప్లెక్స్‌ ఎరువులు ధరలు స్వల్పంగా పెరగడం వాస్తవమే. ఎరువులు వినియోగం తగ్గించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎరువులు వినియోగం ఎంత తగ్గిస్తే అంత మంచిది.’ అని డీఏవో భవనీ శంకర్‌ తెలిపారు.

Updated Date - Aug 01 , 2026 | 11:23 PM