Census గడువుకు ముందే ‘జనగణన ’ పూర్తిచేయండి
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:14 AM
Complete the Census Ahead of the Deadline జిల్లాలో చేపట్టబోయే జనగణన-2027 ప్రక్రియను నిర్ణీత గడవుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ... క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పార్వతీపురం, ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టబోయే జనగణన-2027 ప్రక్రియను నిర్ణీత గడవుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ... క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గడువు వరకు వేచి ఉండకుండా పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించొచ్చన్నారు. జనగణన నమోదుతో పాటు కుటుంబ సర్వే వంటి కీలక కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జనగణనపై జిల్లా, మండల స్థాయి అధికారులు, క్లరికల్, టెక్నికల్ అసిస్టెంట్లకు శుక్రవారం కలెక్టరేట్‌లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణనపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. యాప్ ద్వారా ఈ పని చేపట్టాల్సి ఉన్నందున దిగువస్థాయి సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి, వారి భాషలో అర్థమయ్యేలా వీడియోను రూపొందించి.. అవగాహన కల్పించాలన్నారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ జరగాలని ఆదేశించారు. పనులు వేగవంతం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యధోరణి పనికిరాదని తెలిపారు. మే నెలాఖరుకు జనగణన ప్రక్రియ పూర్తికావాలన్నారు. గడువుకు ముందే లక్ష్యాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. ఈ శిక్షణలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ సాయిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం
ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏపీఎస్‌ఎంఐడీసీ ద్వారా జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టరేట్ నుంచి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలకొండ నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, సాలూరు, కురుపాం ప్రాంతాల్లో చేపడుతున్న ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పార్వతీపురం, సీతంపేటలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల పనులను గడువుకు ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. సీతంపేట ఆసుపత్రిలో మరమ్మతు పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి జి.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు నాగశివజ్యోతి, ఏపీఎస్‌ఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.