Share News

Farmers’ Land Rights రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:03 AM

Complete Protection for Farmers’ Land Rights రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. భూ వ్యవహారాల్లో స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు జారీకి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.

 Farmers’ Land Rights  రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత
పాస్‌ పుస్తకాలు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి, సబ్‌ కలెక్టర్‌, జేసీ

  • పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

సాలూరు, జనవరి2(ఆంధ్రజ్యోతి): రైతుల భూ హక్కులకు పూర్తి భద్రత కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. భూ వ్యవహారాల్లో స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో రాజముద్రతో కొత్త పాస్‌పుస్తకాలు జారీకి శ్రీకారం చుట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. శుక్రవారం సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ వైసీపీ హయాంలో భూముల రీసర్వే పేరుతో జరిగిన గందర గోళానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. రైతులకు భరోసా ఇచ్చేలా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపడుతోంది. ఇది దశలవారీగా జరిగే కార్యక్రమం. జిల్లావ్యాప్తంగా 280కిపైగా గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి సుమారు 77వేల మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు అంది స్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫొటోలతో పాస్‌పుస్తకాలు అందించి.. పొలాల్లో సర్వే రాళ్లు కూడా వేసింది. ఇందుకోసం సుమారు రూ.1350 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. దీనిపై రైతులు పెద్దఎత్తున అభ్యంతరం తెలపడంతో కూటమి సర్కారు అధునాతన సాంకేతికతతో పాస్‌ పుస్తకాలు అందిస్తోంది. ఇందులో భూమి విస్తీర్ణం, మ్యాప్‌, క్యూఆర్‌కోడ్‌ వంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి.’ అని తెలిపారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త పాసుపుస్తకాల పంపిణీ అనేది ఈనెల 9 వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ప్రతి మండలంలో రోజుకు ఒకటి లేదా రెండు గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌ డేటాలో లేదా పాస్‌ పుస్తకాల్లో ఏమైనా తప్పులుంటే సంబంధిత రైతులు స్థానిక వీఆర్వో, సర్వేయర్‌ లేదా తహసీల్దార్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదు చేసిన రెండు నుంచి మూడు వారాల వ్యవవధిలోనే లోపాలను సరిదిద్ది సరైన పత్రాలను అందజేస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీరం సబ్‌ కలెక్టర్‌ వైశాలి, స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హామీని నెరవేర్చిన ప్రభుత్వం

పార్వతీపురం, జనవరి2(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. రాజముద్రతో కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టి.. రైతులకు పండుగ కానుక అందించారు. కాగా తొలి విడతలో పార్వతీపురం నియోజకవర్గంలో 22 వేల మందికి, కురుపాంలో 16వేల మంది , సాలూరులో 17 వేల మంది , పాలకొండలో 24 వేలమంది రైతులకు పాస్‌ పుస్తకాలు అందజేస్తారు. పార్వతీపురం మండలంలోని 24 గ్రామాల్లో 7,082 మందికి, గరుగుబిల్లిలోని 11గ్రామాల్లో 3881, సాలూరులో 27 గ్రామాల్లోని 4567, మక్కువలో 23 గ్రామాల్లో 5327, బలిజిపేటలో 16 గ్రామాల్లో 7565, సీతానగరంలోని 23 గ్రామాల్లో 5662 మంది రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తారు.

పాచిపెంట మండలంలో 18 గ్రామాల్లో 4162, పాలకొండ మండలంలో 34 గ్రామాల్లో 12,630, సీతంపేట మండలంలో 9 గ్రామాల్లో 758, భామిని మండలంలో 9 గ్రామాల్లో 3929, వీరఘట్టం మండలంలో 20 గ్రామాల్లో 6783, కురుపాం మండలంలో ఆరు గ్రామాల్లో 361, జియ్యమ్మవలస మండలంలో 19 గ్రామాల్లో 5206, గుమ్మలక్ష్మీపురం మండలంలో 16 గ్రామాల్లో 1289 మందికి, కొమరాడ మండలంలో 26 గ్రామాల్లో 5662 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందించనున్నారు. కాగా గ్రామసభల్లో ఈకేవైసీ ద్వారా ధ్రువీకరించి భూయజమాని నుంచి సంతకాలు తీసుకుంటారు. పాత పత్రాలు తీసుకుని కొత్త పాస్‌పుస్తకాలు అందిస్తారు. గ్రామసభ, సమావేశం తేదీ ప్రదేశం రైతులకు ముందుగానే తెలియజేస్తారు.

Updated Date - Jan 03 , 2026 | 12:03 AM