Yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:02 AM
Complete Health Through Yoga యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీతంపేట ఎన్‌టీఆర్ అడ్వంచర్‌పార్క్ మైదానంలో యోగాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు.
సీతంపేట రూరల్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీతంపేట ఎన్‌టీఆర్ అడ్వంచర్‌పార్క్ మైదానంలో యోగాంధ్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ యోగా చేయొచ్చన్నారు. ఆరోగ్యవంతమైన జీవనవిధానం వైపు ప్రయాణించడానికి యోగాంధ్ర ఉత్సవాలు దోహదపడతాయని తెలిపారు. ఆరోగ్యమే అత్యంత విలువైన సంపదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 21న ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో కోటి మందితో యోగసనాల కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా సర్వం సిద్ధం చేస్తుం దన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నబగ్గ పంచాయతీ పరిధి నళిని కృష్టసాగరం చెరువు వద్ద జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ‘మన ఊరి చెరువులు.. నీటి వనరులను కాపాడుకోవడమే జలరక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.’ అని అన్నారు. చెరువు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు పెగ్‌మార్కింగ్ పనులను పూర్తిచేశారన్నారు. నీటి వినియోగదారుల సంఘం సభ్యుల సమక్షంలోనే పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయుష్, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవి, తహసీల్దార్ శ్రీకన్య, ఎంపీడీవో మిశ్రో, జలవనరుల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.