Complete All Jaladhara Works నెలాఖరులోగా జలధార పనులన్నీ పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:04 AM
Complete All Jaladhara Works by the End of This Month జలధార పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్‌శాఖ అధికారులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ , అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్షించారు.
పార్వతీపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జలధార పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్‌శాఖ అధికారులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ , అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్షించారు. వినూత్న ఆలోచనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించినప్పుడే క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు సాధ్యమవుతుందన్నారు. చెరువులు ఆక్రమణలు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని సూచించారు. మండలాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఏఈ, డీఈలు కలిసే ఉండాలన్నారు. కొందరు అధికారులు కనిపించకపోవడం వారి అలసత్వానికి నిదర్శనమన్నారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ఇరిగేషన్ ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. షట్టర్లు సరిగ్గా లేని చోట తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, శివారు ఆయకట్టుకు నీరు అందేలా చూడాలని సూచించారు. కాగా ఇరిగేషన్ శాఖలో ఇంకా పాత పద్ధతులను పాటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఈఈ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
యోగా కార్యక్రమం వేదిక మార్పు
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఈ నెల 11న తోటపల్లి వేదికగా జరగాల్సిన యోగా కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అదేరోజు ఉదయం 7 గంటలకు తోటపల్లి ఐటీడీఏ పార్క్‌లో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15న సీతంపేటలోని ఎన్టీఆర్ అడ్వంచర్‌పార్క్‌లో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’లో ఎటువంటి మార్పు లేదన్నారు.
పెదపెంకిని మోడల్‌గా విలేజ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రతిఒక్క అధికారి పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం శాఖలవారీగా అధికారులతో సమీక్షించారు. జిల్లా ప్రతిష్ఠను పెంచేలా ఒక మోడల్ విలేజ్‌ను తయారు చేయలన్నారు. ఇలాంటి అరుదైన అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తాయని చెప్పారు. చెప్పిన పనులే కాకుండా కొత్త ఆలోచనలతో గ్రామాన్ని మరింత అందంగా మార్చాలని సూచించారు. పెదపెంకిలో అన్ని పనులు ఈనెల 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటన ముగిసేవరకు ఏ ఒక్క అధికారి కూడా సెలవు పెట్టడానికి వీల్లేదని చెప్పారు. ఈ వీసీలో ఐటీడీఏ పీవోలు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌డీఏ పీడీ కె.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.