compitative cock పందెంకో‘ఢీ’
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:01 AM
compitative cock సంక్రాంతికి పందెకోళ్లు రెఢీ అయ్యాయి. భోగాపురం మండలంలో విరివిగా విక్రయాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందెంకోళ్లు గుర్తుకొస్తాయి. జిల్లాలో అక్కడికక్కడే గుట్టుగా కోడి పందేలు జరుగుతుంటాయి.
పందెంకో‘ఢీ’
సంక్రాంతికి సిద్ధమవుతున్న పుంజులు
ఒక్కోటి రూ.50వేలు పైమాటే
ఆహారంగా రాగులు, గంటెలు, డ్రైఫ్రూట్స్
భోగాపురం, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి పందెకోళ్లు రెఢీ అయ్యాయి. భోగాపురం మండలంలో విరివిగా విక్రయాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే పందెంకోళ్లు గుర్తుకొస్తాయి. జిల్లాలో అక్కడికక్కడే గుట్టుగా కోడి పందేలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే వాటి విక్రయాలు పెరిగాయి. వేల నుంచి లక్ష రూపాయల వరకు కోళ్ల ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఈ ఏడాది కూడా పందెం కోళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. పుంజులకు బలమైన ఆహారంతో పాటు ఆకులు, అలములతో మరిగించిన వేడినీటిలో ఉంచుతూ వ్యాయామం చేయిస్తూ పందేనికి సిద్ధం చేస్తున్నారు. ఒక దశ దాటిన తర్వాత ఒక్కో పుంజుపై రోజుకు సుమారు రూ.500 పైగా ఖర్చు చేస్తున్నారు.
పందెం కోళ్ల పెంపకానికి సంబంధించి గుడ్లు పొదిగించి మంచి కోడి పిల్లలను ఎంపిక చేసి పందేనికి తయారు చేయడానికి సుమారు రెండేళ్ల సమయం పడుతుంది. వీటికి ప్రతీరోజు రాగులు, గంటెలు, ధాన్యం, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా, మాంసం కైమా ఆహారంగా పెడుతూ పరుగెత్తించడం, ఈత కొట్టించడం చేయిస్తుంటారు. అలాగే చొంటి, నీలగిరి, నల్లమిర్యాలు, వాంపువ్వుతో నీరు మరిగించి ఆ నీటిలో పందెం కోళ్లను కొంత సమయం ఉంచుతారు. ఈవిధంగా 2సంవత్సరాల పాటు పందెం కోడిని పెంచుతారు. భోగాపురం మండలంలో ఓ గ్రామానికి పందెం కోళ్లను సిద్థం చేయడంలో పేరుంది. ఎప్పటిలాగానే ఈఏడాది కూడా ఇక్కడ పందెం కోళ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అక్కడ కాకినెమలి, పచ్చకాకి, కోడికక్కెర, డేగపింగళి, కోడిరసంగి, కోడిఅబ్రాస్, చేతువ, ఎర్రడేగ రకాలకు చెందిన పందెంకోళ్లను సిద్ధం చేస్తున్నారు. రోజు బట్టి కోడిరంగును బట్టి జాతకాలు చూస్తూ కోడిపుంజులను ఎంపిక చేసి తీసుకెళ్తుంటారు. ఇక్కడి పందెం కోళ్ల కోసం భీమవరం, ఒడిశా, విశాఖపట్నం, రణస్థలం, నరవ, ఆరిలోవ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు వచ్చి కొంటారు. తిరిగి లాభాలకు విక్రయిస్తుంటారు.