Share News

Companions who walk by your side వెంట నడిచే నేస్తాలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:33 AM

Companions who walk by your side మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. కష్టమొస్తే వెంటే ఉంటాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటికీ ఓ రోజు ఉందండోయ్‌. అంతర్జాతీయ జూనోసిస్‌ దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకం. దీని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రోజున పెంపుడు జంతువులకు టీకాలు వేస్తుంటాయి.

Companions who walk by your side వెంట నడిచే నేస్తాలు

వెంట నడిచే నేస్తాలు

వాటి క్షేమం చూడాల్సిందే

పెంపుడు జంతువుల నుంచి పొంచి ఉన్న వ్యాధులు

జాగ్రత్తలతో అపాయం దూరం

నేడు అంతర్జాతీయ జూనోసిస్‌ దినోత్సవం

మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. కష్టమొస్తే వెంటే ఉంటాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటికీ ఓ రోజు ఉందండోయ్‌. అంతర్జాతీయ జూనోసిస్‌ దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్నాం. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకం. దీని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రోజున పెంపుడు జంతువులకు టీకాలు వేస్తుంటాయి.

విజయనగరం/బొబ్బిలి/గజపతినగరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

కుక్కలు, పశువులు, గొర్రెలు తదితర పెంపుడు జంతువులను వాటి యజమానులు తమ ఇళ్లల్లో ఓ కుటుంబసభ్యుని మాదిరిగా సాకుతుండడం చూస్తుంటాం. ఆ జంతువులు కూడా ఎంతో విశ్వసనీయంగా మెలుగుతుండడం పరిపాటి. వాటికేదైనా ఆపద ఎదురైతే తల్లడిల్లిపోతుంటారు. అలాంటి పెంపుడు జంతువుల కారణంగా పలు రకాల వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జంతువుల పెంపకం మంచిదే అయినా.. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరం. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు కొన్ని ప్రాణాంతకంగా కూడా ఉన్నాయి. వాటిలో రేబిస్‌ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. అయితే ప్రత్యేక యాంటీ రేబిస్‌ టీకాలు ఉన్నాయి. చాలామంది నిర్లక్ష్యంతో వాటిని వినియోగించడం లేదు. కాగా శాస్త్రవేత్త లుయూస్‌ పాశ్చర్‌ తొలిసారిగా 1885 జూలై 6న ఓ బాలుడికి వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. అది విజయవంతం కావడంతో ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం.

రోగాల వ్యాప్తికి అవకాశం..

జంతువులతో మనిషి జీవితం ముడిపడి ఉంది. ముఖ్యంగా కుక్కల పెంపకం గణనీయంగా పెరిగింది. అయితే జంతువులు, పక్షుల సహచర్యంతో మనిషికి దాదాపు 280 వ్యాధులు సంక్రమిస్తుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు. మనుషుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే వాటిని జూనోసిస్‌ వ్యాధులు అంటారు. ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు 11 రకాలైన వ్యాధులు సంక్రమిస్తాయి. వాటినే జునోటిక్‌ వ్యాధులుగా పేర్కొంటారు. వైరస్‌ ద్వారా రేబిస్‌, మెదడు వాపు, గాలికుంటు, స్వైన్‌ఫ్లూ, ఇన్‌ఫ్లుయంజా వ్యాధులు సోకుతాయి. అందుకే ముందస్తుగా పెంపుడు కుక్కలకు రేబిస్‌ టీకాలు వేయాలి. వీధి కుక్కలకు పశుసంవర్థక శాఖ, స్థానిక సంస్థలు సంయుక్తంగా రేబిస్‌ టీకాలు వేయాలి. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ సరిగా జరగడం లేదు.

జాగ్రత్తలు అవసరం..

కుక్క కరిస్తే యాంటీ రేబిస్‌ టీకా ఐదు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. పెంపుడు జంతువులను పెంచుకునేవారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంతువులను తాకితే వెంటనే సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పెంపుడు కుక్కలు బయటకు తీసుకుళ్లే క్రమంలో వీధికుక్కలు కరవకుండా చూసుకోవాలి. చాలామంది వ్యాక్సినేషన్‌పై అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడుకున్నదని పట్టించుకోరు. కుక్కలకు మామ్మూలుగానే కరిచే గుణం ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్‌ తప్పనిసరి. సాధారణంగా దగ్గరగా ఉండే మనుషులకు కరవడం, గీరడం వంటివి జరుగుతుంటాయి. ఇదే వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుంది. అందుకే ముందస్తుగా టీకాలు వేయించడం ఉత్తమం. జంతు ప్రేమికులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్‌ అవసరాన్ని గుర్తించాలి.

రేబిస్‌తో ప్రమాదం..

జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే వ్యాధులు చాలా ప్రమాదమైనవి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పెంపుడు కుక్కకు విధిగా యాంటీ రేబిస్‌ టీకాలు వేయాలి. జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని బహుళార్ద పశువైద్యశాలతో పాటు జిల్లాలోని అన్ని పశువుల ఆస్పత్రుల్లో ఈ రోజు టీకాలు వేయనున్నారు. ఈ అవకాశాన్ని జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలి.

- జి.మహాలక్మీదేవి, పశువైద్య ఉప సంచాలకురాలు, విజయనగరం

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో జూనోసిస్‌ దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని ఆస్పత్రులకు యాంటీ రేబిస్‌ డోసులను తరలించాం. మూడు నెలల వయసు దాటిన కుక్కలు, పిల్లులకు టీకాలు వేయనున్నాం. జంతువుల నుంచి పశువులకు సోకే వ్యాధులపై అవగాహన సదస్సులు కూడా ఉంటాయి. పెంపకందారులు ఈ విషయంలో ఎటువంటి జాప్యం చేయకూడదు.

- డాక్టరు ఎస్‌ మన్మధరావు, పశుసంవర్థక శాఖ, జేడీ, విజయనగరం

యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం

ఏటా జూలై 6న జూనోసిస్‌ డే నిర్వహిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తున్నాం. సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. బొబ్బిలి పట్టణ, పరిసరప్రాంతాలలో సుమారు 250 పెంపుడు జంతువులున్నాయి. చాలా వరకు వాటి యజమానులు నిర్ణీత గడువులోగా టీకాలు, ఇతర మందులు వేయిస్తున్నారు. ఆదివారం స్థానిక పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో జూనోసిస్‌ డే జరుపుకుంటాం. పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు వేసి అవగాహన కల్పిస్తాం. ఈ మేరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాం.

- డాక్టర్‌ ఎల్‌.విష్ణు, పశుసంవర్ధకశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టరు

జాగ్రత్తలు పాటించండి

పెంపుడు కుక్కల యజమానులు జాగ్రత్తలు పాటించాలి. కుక్కలు ఉండే ప్రదేశాన్ని క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రపర్చాలి. కుక్కలను తాకిన తరువాత చేతులను క్రిమిసంహారక ద్రావణంతో కడగాలి. వ్యాధి గ్రస్తులను ఆరోగ్యవంతమైన కుక్కలకు, పిల్లులకు దూరంగా ఉంచాలి. వ్యాధుల నివారణకు రెగ్యులర్‌ టీకాలు వేయించాలి. నట్టలనివారణ మందులు క్రమం తప్పకుండా వేయించాలి. జూనోసిస్‌ డే సందర్బంగా జూలై6న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలకు ఉచిత రేబిస్‌వ్యాక్సిన్‌లు వేస్తాం.

- చంద్రశేఖర్‌, పశువైద్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, గజపతినగరం

------------

Updated Date - Jul 06 , 2026 | 12:33 AM