కొఠియాలో ఎన్ని*కలకలం*
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:17 AM
*Commotion* over elections in Kotiya స్థానిక ఎన్నికల వేళ.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కొఠియా పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఏపీ అధికారులు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒడిశా ఆందోళన చెందుతోంది. ఎలాగైనా ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ఆ రాష్ట్ర సర్కారు యోచిస్తోంది.
అడ్డుకునేందుకు ప్రయత్నాలు
వేడెక్కిన రాజకీయ వాతావరణం
పోలింగ్‌లో పాల్గొనరాదని ఆ రాష్ట్ర ప్రతిపక్షాల పిలుపు
రోజురోజుకూ ముదురుతున్న వివాదం
పార్వతీపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వేళ.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు వివాదాస్పద ప్రాంతం కొఠియా పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఏపీ అధికారులు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒడిశా ఆందోళన చెందుతోంది. ఎలాగైనా ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ఆ రాష్ట్ర సర్కారు యోచిస్తోంది. కాగా అక్కడి రాజకీయ వాతావరణం కూడా ఒక్కసారిగా వేడెక్కింది. కొఠియాలో ఏపీ స్థానిక ఎన్నికలను రద్దు చేయాలని ఒడిశా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అడ్డుకుంటామంటున్న ఒడిశా
- కొఠియా ప్రాంతంలో ఏపీ పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటామని ఒడిశా సర్కారు స్పష్టం చేసింది. ఆ ప్రాంతం తమ రాష్ట్రంలో అంతర్భాగమని నొక్కి చెప్పింది. అంతేగాకుండా ఏపీ ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరాపుట్ జిల్లా యం త్రాంగానికి ఒడిశా రెవెన్యూశాఖ మంత్రి సురేష్ పూజారి ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. దీనిపై ఆయన నేతృత్వంలో అడ్వకేట్ జనరల్, దక్షిణ రెవెన్యూ కమిషనర్, కొరాపుట్ కలెక్టరేట్లతో ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణను ఆపేందుకు ఒడిశా ప్రభుత్వం చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
- మరోవైపు కొఠియా పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో ఏపీ ఎన్నికల కార్యకలాపాలను ప్రతిపక్ష బీజూ జనతాదళ్ పార్టీకి చెందిన బృందం పరిశీలించింది. మాజీ ఎంపీలు , పార్టీ గిరిజన సెల్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు నిరసన తెలిపారు. పోలింగ్‌లో ఎవరూ పాల్గొనరాదని గిరిజనులకు సూచించారు. వెంటనే ఏపీ స్థానిక ఎన్నికలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అంతకుముందే ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీకి లెటర్ కూడా రాశారు. కొఠియా వివాదాన్ని పరిష్కరించి, ఒడిశా ప్రాదేశిక సమగ్రతను, ఆత్మగౌరవాన్ని కాపాడుతామని బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు.
- కొఠియా గ్రూప్ పరిధి.. సాలూరు మండలంలోని పట్టుచెన్నూరు గ్రామంలో శుక్రకవారం గిరిజనులు వైసీపీ తరపున ప్రచారం చేస్తుండగా.. బీజేడీ శ్రేణులు అడ్డుకున్నాయి. వారి భోజనాలను నేలపాలు చేశాయి. ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయొద్దంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది.
ఏళ్లు గడుస్తున్నా.. తేలని పంచాయితీ
కొఠియా వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. కొన్నేళ్లుగా ఏపీ, ఒడిశాల మధ్య ఇది లేదని పంచాయితీగా ఉంది. కొఠియా గ్రూప్‌లో ఎగువ కొఠియా, దిగువ కొఠియా, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర, కురిడిభద్ర, ఎగువశెంబి, దిగువశెంబి, ధూళిభద్ర, సోలిపిగుడ తదితర 21 గ్రామాలున్నాయి. తూర్పు కనుమల్లో అపార ఖనిజ సంపదతో ఉన్న ఈ గ్రామాలపై ఇరు రాష్ట్రాలు తమవంటే, తమవని వాదులాడుతున్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత సరిహద్దుల గుర్తింపులో జరిగిన కొన్ని లోపాల వల్ల ఈ వివాదం మరింత ముదిరింది. దీనిపై ఒడిశా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. ఈ గ్రామాల వివాదంపై 1968, డిసెంబరు 2న సుప్రీంకోర్టు స్టేటస్కో జారీ చేసింది. దీంతో కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఏపీ, ఒడిశాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తునే ఉన్నాయి. కొఠియా గ్రూప్ గ్రామాల్లో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వారికి రెండు రాష్ర్టాల రేషన్ కార్డులు, రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కొఠియా వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని 2006లో సుప్రీంకోర్టు సూచింది. అయితే కొఠియాపై ఆధిపత్యానికి ఒడిశా ప్రయత్నిస్తోంది. తమదే కొఠియా అంటూ 2018 నుంచి దూకుడు పెంచింది. కోట్లాది రూపాయలతో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. మరో వైపు ఏపీ ఉద్యోగులు కొఠియా వెళ్తే.. ఒడిశా అధికా రులు అడ్డుకోవడం పరిపాటిగా మారింది. దీంతో కొన్నిసార్లు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడు తున్నాయి.