Commotion in the School బడిలో అలజడి
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:44 PM
Commotion in the School పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు స్థానిక ఎన్నికలను తలపించాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వీలైనంతవరకూ ఏకగ్రీవాలు జరిగాయి. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా చోట్ల ఏకాభిప్రాయం కుదరక వాయిదాపడ్డాయి.
బడిలో అలజడి
ఎస్‌ఎంసీ ఎన్నికల్లో పలు చోట్ల పోటాపోటీ
కొన్నిచోట్ల ఘర్షణలతో వాయిదా
టీడీపీ మద్దతుదారుల ఉత్తేజం.. వైసీపీలో నిస్తేజం
విజయనగరం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి)
పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు స్థానిక ఎన్నికలను తలపించాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వీలైనంతవరకూ ఏకగ్రీవాలు జరిగాయి. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆయా చోట్ల ఏకాభిప్రాయం కుదరక వాయిదాపడ్డాయి. ఈ క్రమంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్తతలకూ దారితీశాయి. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార కూటమిలోనే పోటీ నెలకొంది. అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు మారింది.
జిల్లా వ్యాప్తంగా 1,767 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని పాఠశాలల్లో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. రాజాం మండలం ఆగూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా..సీఐ నవీన్ కుమార్ రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటుచేశారు. గంట్యాడ మండలం పెంటశ్రీరాంపురం, రొంపల్లి వంటి చోట్ల ఏకాభిప్రాయం కుదరక ఎన్నికలు వాయిదాపడ్డాయి. మరోవైపు నెల్లిమర్ల మండలం రామతీర్థాలు ఉన్నత పాఠశాలలో టీడీపీ, జనసేన మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఇలా కొద్దిచోట్ల మాత్రమే వివాదంగా మారింది.
స్థానిక ఎన్నికల ముంగిట.
స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే చాలావరకూ వైసీపీ నేతలు ఈ ఎన్నికల జోలికి వెళ్లలేదు. మరికొన్ని చోట్ల పోటీలో నిలబడినా సత్తాచాటలేక సాగిల పడ్డారు. మరోవైపు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ ఉంటుందన్న గ్రామాల్లో మాత్రం తమ వర్గం వారిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో పెద్దగా పోటీ లేదు. ఆ నియోజకవర్గం నుంచి అధికార టీడీపీలోకి భారీగా చేరికలు నేపథ్యంలో పోటీకి వైసీపీ శ్రేణులు దూరంగా ఉండిపోయాయి.
37 పాఠశాలల్లో నిలిచిన ఎన్నిక
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 1,763 స్కూల్స్‌కు ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 37 చోట్ల ఎన్నికలు జరగలేదు. 29 చోట్ల కోరం లేక వాయిదా పడగా, 8 చోట్ల వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. మొత్తం ఎన్నికలు జరిగిన 1726 స్కూల్స్‌కు సంబంధించి 758 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహించారు. వాయిదా పడిన చోట్ల ప్రభుత్వం అనుమతి వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు.
పిలిచి పస్తులుంచారని మండిపాటు
మెంటాడ, సెప్టెంబరు29(ఆంద్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఆకలి తీర్చాల్సిన చోటే వారి తల్లిదండ్రులు ఆకలి కష్టాలు పడ్డారు. మంగళవారం జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఈ పరిస్థితి కనిపించింది. కేజీబీవి, ఆదర్శపాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు దూరాభారం నుంచి రూ.వందలు ఖర్చుచేసుకుని వచ్చి చివరకు ఆకలితోనే తిరుగుముఖం పట్టాల్సిన దుస్థితి కలిగింది. పిలిచి పస్తులు పెట్టడం ఎంతవరకూ సబబని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకున్నామని, భోజనాలు పెట్టాలని ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని మండల విద్యాశాఖాదికారి, డిప్యూటీ డీఈవో మోహనరావు చెప్పారు.
ఉద్రిక్తత నడుమ ఎన్నిక వాయిదా
సంతకవిటి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మంగళవారం మొదలైన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నిక ఉద్రిక్తతల మధ్య వాయిదా పడింది. ఇక్కడ 163 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నిక నిర్వహణకు 82 మంది ఓటర్ల హాజరు అవసరం. ఉదయం 11 గంటల సమయంలో వైసీపీకి చెందిన 43 మంది ఓటర్లు హాజరు కాగా ఎన్నికల అధికారి, ప్రఽధానోపాధ్యాయురాలు ఎంవీ సాయీశ్వరి వారి సంతకాలు తీసుకున్నారు. అయితే వీరిలో చాలా మంది కోరం లేదు కాబట్టి ఎన్నిక జరిగేటట్టు లేదని భావించి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీకి చెందిన 83 మంది ఓటర్లు హాజరయ్యారు. ఈ విషయం తెలిసి వైసీపీ మద్దతుదారులు తిరిగి వచ్చి అభ్యంతరం తెలిపారు. తాము ఉన్నంతవరకూ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నించలేదని, టీడీపీ వారు వచ్చాక త్వరగా ఎన్నిక చేపట్టేందుకు ప్రయత్నించారంటూ అభ్యంతరం తెలిపారు. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల నడుమ తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు హెచ్‌ఎం ప్రకటించారు. ఒకానొక దశలో పోలీసులు రంగప్రవేశం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొల్ల అప్పలనాయుడు అక్కడకి చేరుకుని ఎన్నికల అధికారిని, ఉపాధ్యాయులను ప్రఽశ్నంచారు. కోరం ఉన్నప్పటకీ ఎన్నిక ఎందుకు నిర్వహించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.