Commissions కమీషన్లు అందట్లే!
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:20 AM
Commissions Not Being Received! జిల్లాలోని రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులకు సంబంధించిన కమీషన్లు అందడం లేదు. గత నాలుగు నెలలుగా వాటి కోసం వారు ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వస్తున్న 50 కిలోల బియ్యం బస్తాకు సుమారు 5 కిలోలు తగ్గడంతో ఆ భారం తమపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు నెలలుగా ఎదురుచూపు
సంక్రాంతికైనా ఇవ్వాలని వేడుకోలు
గరుగుబిల్లి, జనవరి11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రేషన్ డీలర్లకు నిత్యావసర సరుకులకు సంబంధించిన కమీషన్లు అందడం లేదు. గత నాలుగు నెలలుగా వాటి కోసం వారు ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి వస్తున్న 50 కిలోల బియ్యం బస్తాకు సుమారు 5 కిలోలు తగ్గడంతో ఆ భారం తమపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎంఎల్‌ఎస్ పాయింట్ల పరిధిలోని సిబ్బందికి తెలియపర్చినా పట్టించుకోవడం లేదం టున్నారు. గోడౌన్‌లో ఎలుకలు సంచరించడం కారణంగా తరుగుదల వస్తున్నాయని సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. జిల్లాలో 578 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. 2.53 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ మేరకు డీలర్లు ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, రాగులు, గోధుమ పిండి అందిస్తున్నారు. బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం డీలర్లకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. క్వింటా బియ్యానికి రూ.100 చొప్పున నెలకు సుమారు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు డీలర్ల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే గత నాలుగు నెలలుగా కమీషన్ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు సంబంధించి వారి ఇళ్లకు వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందిస్తున్నామని, దీనివల్ల రవాణా చార్జీల భారం తమపై పడుతుందంటున్నారు. మరోవైపు కమీషన్లు కూడా సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. దీనిపై పలు దఫాలు పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులకు వినతులు అం దించినా స్పందన లేదని ఆవేదన చెందు తున్నారు. సంక్రాంతికైనా కమీషన్లు జమ చేయాలని కోరుతున్నారు. దీనిపై సివిల్ సప్లైస్ శాఖ జిల్లా మేనేజర్ బి.అశోక్‌కుమార్‌ను వివరణ కోరగా.. రేషన్ డీలర్లకు నాలుగు నెలల కమీషన్‌ను చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఎస్‌ఎన్‌ఏఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్ చెల్లింపుల విధానంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించాం. అత్యధిక డీలర్లు సరైన బ్యాంకు ఖాతాల వివరాలు అందించలేదు. అందుకే చెల్లింపుల్లో జాప్యం నెలకొంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. తరుగుదలపై చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.