Share News

Coming to Sankranti సంక్రాంతికి వస్తున్నాం

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:16 AM

Coming to Sankranti సంక్రాంతి అంటే జిల్లా ప్రజలకు ఇష్టమైన పండగ. ఎక్కడ ఉన్నా ఆస్వాదించేందుకు సొంతూరులో వాలిపోతారు. జిల్లాకు వచ్చేందుకు పరితపిస్తుంటారు. ఈ ఏడాది కూడా మూటముళ్లెతో ఒక్కొక్కరూ దిగుతున్నారు. శ్రమజీవులు, విద్యాధికులు, ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఇలా అందరూ పల్లెబాట పట్టారు. హైవేలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిస్తున్నాయి. వందలాది కార్లతో టోల్‌ గేట్లు రద్దీగా మారాయి. అటు పల్లెలకు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామాల్లో సంక్రాంతి జోష్‌ మొదలైంది.

Coming to Sankranti సంక్రాంతికి వస్తున్నాం

సంక్రాంతికి వస్తున్నాం

వలస జీవుల రాకతో పల్లెల్లో మొదలైన సందడి

కళకళలాడుతున్న గ్రామాలు

మూటముళ్లెతో దిగుతున్న శ్రమజీవులు

గ్రామాల్లో మొదలైన పలకరింపులు

ఉన్నత చదువుకు వెళ్లిన వారూ రాక

సంక్రాంతి అంటే జిల్లా ప్రజలకు ఇష్టమైన పండగ. ఎక్కడ ఉన్నా ఆస్వాదించేందుకు సొంతూరులో వాలిపోతారు. జిల్లాకు వచ్చేందుకు పరితపిస్తుంటారు. ఈ ఏడాది కూడా మూటముళ్లెతో ఒక్కొక్కరూ దిగుతున్నారు. శ్రమజీవులు, విద్యాధికులు, ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఇలా అందరూ పల్లెబాట పట్టారు. హైవేలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిస్తున్నాయి. వందలాది కార్లతో టోల్‌ గేట్లు రద్దీగా మారాయి. అటు పల్లెలకు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామాల్లో సంక్రాంతి జోష్‌ మొదలైంది.

విజయనగరం/ గజపతినగరం, జనవరి 12(ఆంధ్రజ్యోతి):

సంక్రాంతికి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు వాహనాల్లో కూడా కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా సందడి నెలకొంది. రెండురోజుల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చినవారితో విజయనగరం, బొబ్బిలి, ఎస్‌.కోట, రాజాం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి మార్కెట్‌ ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఉప్పు, పప్పులే కాదు.. చీర, పంచె, పిల్లలకు అవసరమైన వస్త్రాలను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. బాలాజీమార్కెట్‌, గంటస్తంభం, పెదమార్కెట్‌, ఉల్లివీధి, ఎంజీ రోడ్‌, స్టేషన్‌ రోడ్డు రోజంతా కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు దూరంగా ఉన్న బంధువులు, అయినవారి పలకిరింపులతో పల్లె ప్రజలు ఉబ్బితబ్బిబ్బువుతున్నారు. బాగున్నావా...అన్న పిలుపుకోసం పరితపించి పోయిన వలస జీవులు.. సొంతూళ్లలో అడుగుపెట్టగానే.. భావోద్వేగానికి గురౌవుతున్నారు. ఇంటికి చేరుకోగానే కళ్లల్లో ఆనందభా ష్పాలతో తల్లిదండ్రులను చూసి ఆనందంతో మురిసిపోతున్నారు. అప్పుడే వారికి పండగ వచ్చినట్లు అయ్యింది. ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లిన వారు గ్రామాల్లో తోబుట్టువుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయతలు పంచుకుంటున్నారు. పెద్దవారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఫ పిండి వంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. కోడిపందేల బరులు, గ్రామాల్లో జాతర్లు, తీర్థాల ఏర్పాట్లు పండగ కళను పంచుతున్నాయి. బుధవారమే భోగి కావడంతో యువత సన్నాహాల్లో మునిగింది. కొత్త దుస్తుల కొనుగోళ్లతో వస్త్ర దుకాణాల్లో ఇసుకేస్తే రాలనంతగా కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

ఆ పిండి వంటలు తిని తీరాల్సిందే

కళ్యాణ్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, గంగచోళ్లపెంట, గజపతినగరం మండలం

బెంగళూరులోని సీమాన్స్‌ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. ఏటా సంక్రాంతికి మా గ్రామానికి వస్తుంటాను. అమ్మ, అక్కలు చేసిన పిండివంటల రుచిచూడనిదే నాకు పండగలా ఉండదు. నాతో పాటు ఎంతో మంది మిత్రులు పండగకి వస్తారు. చిన్నప్పుడు పండగ సమయాల్లో చంపావతి నదీ తీరంలో ఈత కొడుతూ, అదే నదిలో చేపలు పట్టి ఇంటికి తీసుకువెళ్లేవాళ్లం.

సొంతూరు రావడం ఆనందదాయకం

సంక్రాంతికి సొంత ఊరు రావడం ఆనందదాయకం. గల్ఫ్‌లో ఉన్న తాను రానుపోను చార్జీల రూపంలో రూ.30 వేలు ఖర్చు అవుతుంది. నెలరోజులు ముందుగా ప్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నా. ఏడాదికి ఒక పర్యాయం వచ్చే ఈ ఆనందం చెప్పలేనిది.

- టి.గణేష్‌, గజపతినగరం

అమెరికా నుంచి ఏటా వస్తున్నాం

ఏటా సంక్రాంతిని సొంతూరులో కుటుంబ సభ్యులతో జరుపుకోవడం ఆనందదాయకం. అమెరికా నుంచి అందరం కలిసి వస్తుంటాం. నెల రోజులముందే టూర్‌ ప్రోగ్రాం ఫిక్స్‌ చేసుకోవాలి. రావడానికి కాస్త ఇబ్బంది పడినా అక్కడి పండగ వాతావరణం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

- గెద్ద గణేష్‌,మరుపల్లి

------------------------

Updated Date - Jan 13 , 2026 | 12:16 AM