Let’s Go to the Hospital! లేరా చిన్నా.. ఆసుపత్రికి వెళ్దాం!
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:35 PM
Come On, Little One… Let’s Go to the Hospital! ఆసుపత్రిలో చికిత్స కోసమని తల్లిదండ్రులతో బైక్‌పై బయల్దేరిని ఆ బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషద ఘటన సాలూరు మండలంలో చోటుచేసుకుంది.
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఒక్కగానొక్క కొడుకు.. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు. కూలి పనిచేస్తూ కష్టపడి చదివిస్తున్నారు. ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నారు. జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడిన కొడుకు రక్తపుమడుగులో చూసి జీర్ణించుకోలేక పోయారు. ‘లేరా చిన్నా ఆసుపత్రికి వెళ్దాం’ అంటూ గుండెలవిసేలా రోదించారు.
సాలూరు /మక్కువ, ఆగస్టు7(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో చికిత్స కోసమని తల్లిదండ్రులతో బైక్‌పై బయల్దేరిని ఆ బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషద ఘటన సాలూరు మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్కువ మండలం కవిరిపల్లికి చెందిన బడ్రాజు శంకరరావు, చిన్నమ్మలు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరి సంతానం. కుమారుడు బడ్రాజు భార్గవ్ (15) సీతానగరం మండలం జోగింపేట గిరిజన హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. కూతురు అవంతిక మక్కువ మండలం ఏపీ మోడల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతోంది. కాగా భార్గవ్ కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాలుడితో కలిసి తల్లిదండ్రులు బైక్‌పై సాలూరు ప్రభుత్వాసుత్రికి పయనమయ్యారు. అయితే శంబర నుంచి మామిడిపల్లి వెళ్లే రహదారి మార్గంలో పందిరి మామిడివలస జంక్షన్ వద్ద ట్రాక్టర్‌ను దాటించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొక్కల లోడుతో పాచిపెంట మండలం మాతుమూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో బైక్‌తో పాటు వారంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.‘ వైద్యసేవల కోసమని ఆసుపత్రికి బయల్దేరితే.. తిరిగిరాకి లోకాలకు వెళ్లిపోయావా.. బిడ్డా! ’ అంటూ భోరున విలపించారు. సాలూరు రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొట్టూరు గ్రామానికి చెందన డ్రైవర్ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు.