Share News

పోలింగ్‌కు రారండోయ్‌! Come Forward to Vote!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:24 AM

Come Forward to Vote! పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే సర్పంచ్‌ అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఉపాధి, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం స్వగ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన వారికి పిలుపు చేస్తున్నారు. ఫోన్లు చేసి.. క్షేమ సమాచారం తెలుసుకుని.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వాస్తవంగా జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు.

 పోలింగ్‌కు రారండోయ్‌! Come Forward to Vote!

  • ఫోన్లు చేసి కబురు పెడుతున్న వైనం

  • ఒక్కో ఓటుకు రానుపోను చార్చీల ఖర్చు రూ.4 వేల పైనే..

పార్వతీపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే సర్పంచ్‌ అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఉపాధి, ఉద్యోగాలు, చదువుల నిమిత్తం స్వగ్రామాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లిన వారికి పిలుపు చేస్తున్నారు. ఫోన్లు చేసి.. క్షేమ సమాచారం తెలుసుకుని.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. వాస్తవంగా జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 30 వేలకుపైబడి వలస ఓటర్లు ఉన్నారు. అయితే తొలి దశలో జరిగే పంచాయతీ ఎన్నికల కోసం అభ్యర్థులు వారందర్నీ స్వగ్రామాలకు రప్పిస్తున్నారు. ఇదే తరుణంలో వలస ఓటర్ల రానుపోను రవాణా ఖర్చులు వారికి తడిసిమోపెడవుతున్నాయి. ఒక్కో వలస ఓటు కోసం సుమారు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వెచ్చిస్తున్నారు. కొంతమంది వలస ఓటర్లకు ముందస్తుగా ఈ మొత్తం పంపిస్తున్నారు. ఓటు వేసి వెళ్లిన తర్వాత వారికి అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తామని చెబుతున్నారు. అసలు పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో ఉన్న పంచాయతీలకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయని తొలుత అభ్యర్థులు భావించారు. ఈ మేరకు వలస ఓటర్లకు కబుర్లు పంపించారు. కొంతమంది రిజర్వేషన్లు కూడా చేశారు. తీరా ఇప్పుడు మొదటి దశలోనే ఎన్నికలు జరగనుండడంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ‘ 26న జరగనున్న పోలింగ్‌కు రండి.. మరికొన్ని డబ్బులు పంపించాలా.. మళ్లీ రిజర్వేషన్లు చేయాలా? అని వలస ఓటర్లకు కబుర్లు పంపుతున్నారు. మొత్తంగా ఒకవైపు గ్రామాల్లో ప్రచారం, మరోవైపు వలస ఓటర్లను రప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తంగా ఒక్కో పంచాయతీకి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు వరకు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:24 AM