Share News

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:30 PM

ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?
పనులు ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర

-తీరు మార్చుకోపోతే బాధ్యులపై చర్యలు

-కలెక్టర్‌కు మంత్రి సంధ్యారాణి ఆదేశాలు

-వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభం

పార్వతీపురం/రూరల్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మంగా ఈ కార్యక్రమం చేపడుతోందని, ఇలాంటివి సహించేదిలేదని స్పష్టం చేశారు. గురువారం పార్వతీపురం మండలం చిన్నబొండపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువు పనులను మంత్రితో పాటు ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో కూడా ఈ పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో వంద రోజులు పనిదినాలు కల్పిస్తే, ఇప్పుడు వాటిని 125 రోజులకు పెంచామని తెలిపారు. ఎస్టీ గ్రామాల్లో 175 రోజులు పని కల్పిస్తామన్నారు. ప్రతి వ్యక్తికీ గరిష్టంగా రూ.312 వేతనం లభించాలన్నారు. ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ.. వీబీ-జీరామ్‌జీతో పంచాయతీల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యం, కొప్పల వెలమల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గొట్టాపు వెంకటనాయుడు, ఏపీవో కృష్ణారావు, ఈసీ కృష్ణారావు, టీడీపీ మండల అధ్యక్షుడు బోను దేవిచంద్రమౌళి, పెద్దబండపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు జి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల రూపురేఖలు మారుతాయి..

వీబీ-జీరామ్‌జీ పథకం కేవలం ఉపాధి పనులకే కాకుండా గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ఉపయోగపడుతుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఈ పథకాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లా డుతూ.. పనులు చూపించడంతో పాటు వేతనాలను సకాలంలో చెల్లించే విధంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వీబీ-జీరామ్‌జీ పోస్టర్‌ను విడుదల చేశారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రరావు, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:30 PM