cock fight సై
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:18 AM
cock fight జిల్లాలో పందెం కోళ్లు తలపడుతున్నాయి. పందెం రాయుళ్లకు సంక్రాంతి ముందే వచ్చేసింది. ఐదు రోజుల్లో సంక్రాంతి ఉందనగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు, పొట్టేళ్ల పందేలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఇంకాస్త ముందే మొదలైపోయింది. అయితే చట్టవిరుద్ధమైన క్రీడ కావడంతో పోలీస్‌లు అడ్డుకుంటున్నారు. వారికి దొరక్కుండా కొందరు రహస్య ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు.
సై
ముందే వచ్చేసిన సంక్రాంతి
జిల్లాలో రహస్యంగా కోడి పందేలు
గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతికి బరిల ఏర్పాటు
ఇక్కడ మాత్రం భయంభయంగా నిర్వహణ
శ్రీరామ నవమి వరకు పోలీస్‌లకు తప్పని పరుగు
- గంట్యాడ మండలం జగ్గాపురం గ్రామ శివారులో నాలుగు రోజుల కిందట కోడి పందేలు జరిగాయి. పోలీస్‌లకు సమాచారం అందడంతో దాడి చేశారు. వీరిని చూసిన పందెంరాయుళ్లు పరుగందుకున్నారు. అయినప్పటికీ పోలీస్‌లు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రెండు పందెం కోళ్లు, రూ.10,200 నగదు, నాలుగు బైకులు, 9 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
శృంగవరపుకోట, జనవరి 9(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పందెం కోళ్లు తలపడుతున్నాయి. పందెం రాయుళ్లకు సంక్రాంతి ముందే వచ్చేసింది. ఐదు రోజుల్లో సంక్రాంతి ఉందనగా గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు, పొట్టేళ్ల పందేలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఇంకాస్త ముందే మొదలైపోయింది. అయితే చట్టవిరుద్ధమైన క్రీడ కావడంతో పోలీస్‌లు అడ్డుకుంటున్నారు. వారికి దొరక్కుండా కొందరు రహస్య ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ డ్రోన్ కెమెరాల కారణంగా అక్కడక్కడ పట్టుబడుతున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ మూడు రోజులు బహిరంగంగానే కోడి పందాలు జరుగుతుంటాయి. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడి పోలీస్ అధికారులు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుల్లా కోడి పందేల నిర్వాహకులు సమీప కొండలు, మెట్టలు, తోటల్లో బరిలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడకు పోలీస్‌లోచ్చేలోపే పోటీలను ముగిస్తున్నారు.
తెలుగు రాష్ర్ట్రాలకు అతి పెద్ద పండగ సంక్రాంతి. దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఒకట్రెండు రోజుల ముందే సొంతూరులో వాలిపోతారు. భోగి, సక్రాంతి, కనుమ రోజుల్లో అనందంగా గడపాలనుకుంటారు. పల్లెల్లో కోళ్లు విస్తృతంగా అందుబాటులో ఉండడంతో పూర్వం నుంచి కోడి పందేలు కూడా పండగ సంప్రదాయాల్లో భాగంగా మారిపోయాయి. మరో ఐదు రోజుల్లో సంక్రాంతి వచ్చేస్తుంది. ఇప్పటి నుంచే జిల్లాలో అక్కడక్కడ రహస్యంగా కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తోంది. దాడులకు దిగుతోంది. అయితే బరిల వద్దకు పోలీస్‌లు చేరుకునే లోపే అక్కడ నుంచి జారుకుంటున్నారు. మరో చోట ముందే సిద్ధం చేసుకున్న మకాం వద్దకు చేరిపోతున్నారు.
జిల్లాలో శ్రీరామనవమి వరకు పోలీస్‌లకు పరుగు తప్పదు. పలు జిల్లాల్లో సంక్రాంతితో కోడి పందేలు ముగుస్తాయి. జిల్లాలో మాత్రం సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకు ప్రతి రోజు ఏదో ఒక ఊర్లో గ్రామ దేవతల తీర్థాలు, పండగలు జరుగుతాయి. ఒకటి నుంచి మూడు రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. ఈ సమయంలో పేకాట, కోడి పందేలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇటువైపు చూడకుండా గ్రామ పెద్దలు పార్టీలకు అతీతంగా ఒక్కటై పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తుంటారు.