CM's direction for the development of the district జిల్లా అభివృద్ధికి సీఎం దిశానిర్దేశం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:10 AM
CM's direction for the development of the district కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక సూచనలు, సలహాలు ఇచ్చారు. పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. అమరావతిలో రెండోరోజు సమీక్షలో భాగంగా గురువారం అభివృద్ధిపైనే మాట్లాడారు.
జిల్లా అభివృద్ధికి సీఎం దిశానిర్దేశం
3సీ విధానాన్ని అనుసరించాలని సూచన
పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని సలహా
ఇంకొన్ని ముఖ్య అంశాల ప్రస్తావన
ఉగాదికి పేదల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశం
విజయనగరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):
కలెక్టర్ల సదస్సులో జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక సూచనలు, సలహాలు ఇచ్చారు. పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. అమరావతిలో రెండోరోజు సమీక్షలో భాగంగా గురువారం అభివృద్ధిపైనే మాట్లాడారు. కమిట్‌మెంట్-కన్విన్స్- కోఆపరేటివ్ (3సీ) విధానాన్ని అనుసరించాలని చెప్పారు. పొరుగున ఉన్న విశాఖపట్టణం రీజియన్‌ను ఎకనమిక్ డెవలప్‌మెంట్ జోన్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన త్వరితగతిన అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో పెట్టుబడుల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పరిశ్రమలను రాబట్టాలని, ఇందుకు తగిన ప్రోత్సాహం అందివ్వాలని నిర్దేశించారు. పర్యాటకరంగం అభివృద్ధిలో భాగంగా చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, పురాతన కట్టడాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. విజయనగరం జిల్లాలో ఈ రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని గుర్తుచేశారు.
- వడగాలులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ఏఐ సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించే వ్యవస్థలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు వేసవి ప్రభావంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
- విజయనగరంజిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న 500 ఎకరాలను ఏవియేషన్ హబ్ అభివృద్ధి కోసం జీవీఐఏల్‌కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా ప్రయత్నించాలని సూచించారు.
- ఉగాది నాటికి 4014 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 3798 ఇళ్లు పూర్తి చేశామని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి వివరించారు. వాణిజ్య పన్నుల కింద జిల్లాలో రూ.329 కోట్లు వసూలు చేశామని, గత ఏడాదితో పోల్చితే ఇప్పటికి 6.14 వృద్ధిని సాధించామన్నారు. జీఎస్‌టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే ఈ సారి 0.82 శాతం తగ్గాయని వివరించారు.
- హీట్ వేవ్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పలు అంశాలను వివరించారు. ఆసుపత్రుల్లో హీట్ స్ర్టోక్ చికిత్స గదుల ఏర్పాటు, ఓఆర్‌ఎస్, ఫ్లూయిడ్స్ నిల్వలు, సిబ్బందికి శిక్షణ వంటిచర్యలు వివరించారు.
- సూపర్ సిక్స్, ఉపాధిహామీ పథకం, పేదల ఇళ్ల నిర్మాణం, రవాణా గనులశాఖ పనితీరుపై సమీక్షించారు.
- జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని... పోలీస్, ఆర్టీఓ అధికారులు దృష్టిసారించి పూర్తిగా అదుపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశించారు.