Share News

నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:02 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 4.20 గంటలకు లక్కవరపుకోట మండల కేంద్రంలో ఉన్న శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసానికి రానున్నారు.

నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు
సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎమ్మెల్యే లలితకుమారితో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

  • నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నివాసానికి రాక

  • 27న వివాహం కానున్న ఆమె కుమార్తెకు ఆశీర్వాదం

శృంగవరపుకోట (లక్కవరపుకోట), ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 4.20 గంటలకు లక్కవరపుకోట మండల కేంద్రంలో ఉన్న శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసానికి రానున్నారు. ఈమేరకు అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 8.40గంటలకు విజయవాడ ఉండవల్లిలో హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం ఉదయం 10గంటలకు అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ కోడూరు (ఎ.కోడూరు) చేరుకోనున్నారు. సాయంత్రం 4గంటల వరకు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నాక అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.10గంటలకు లక్కవరపుకోట మండల పరిధిలోని విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని ఉన్న బహిరంగ ప్రదేశంలో దిగనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఎల్‌.కోటలో వున్న ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నివాసానికి వస్తున్నారు. ఈనెల 27న తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పలరామప్రసాద్‌, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె అస్మితనాయుడుకు విశాఖపట్టణం సుజాతనగర్‌కు చెందిన చప్ప ఎర్ని కృష్ణ, సత్యవేణి దంపతుల కుమారుడు ఎర్ని పవన్‌ మౌళితో వివాహం జరగనుంది. ముందుగానే వధువు అస్మితనాయుడుకు ఆశీర్వాదం అందించేందుకు సీఎం వస్తున్నారు. దీంతో హెలిపాడ్‌ దిగే ప్రదేశాన్ని శుక్రవారం కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ ఏ.ఆర్‌ దామోదర్‌లు ఎమ్మెల్యే లలితకుమారితో కలసి పరిశీలించారు. ఎమ్మెల్యే నివాసం వరకు సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే మార్గంలోనూ భద్రతా ఏర్పాట్లు చూశారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు ఎస్పీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినిపించే ఎటువంటి సమస్యలకైనా అప్పటికప్పుడు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా వుండేలా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచనలు ఇచ్చారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఽశనివారం ఎల్‌.కోటకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులతో శుక్రవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. హెలిపాడ్‌ వద్ద భద్రత, బందోబస్తు, కాన్వాయ్‌ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 22 , 2026 | 08:44 AM