Share News

Freehold ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:30 PM

Clearance for Freehold కూటమి ప్రభుత్వం జిల్లా రైతులకు శుభవార్త చెప్పింది. జగన్‌ హయాంలో ఇష్టానుసారం నిషేధ భూముల జాబితా(22ఏ)లో చేర్చిన భూముల ఫ్రీహోల్డ్‌కు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది.

 Freehold ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌

  • చుక్కల భూమి, ఇనాం, షరతుగల పట్టా భూముల రిజిస్ర్టేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • మన్యంలో పేద రైతులకు ఊరట

పార్వతీపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం జిల్లా రైతులకు శుభవార్త చెప్పింది. జగన్‌ హయాంలో ఇష్టానుసారం నిషేధ భూముల జాబితా(22ఏ)లో చేర్చిన భూముల ఫ్రీహోల్డ్‌కు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఫ్రీహోల్డ్‌ భూములకు విముక్తి కల్పిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. అసైన్డ్‌, చుక్కలు, షరతుగల పట్టా భూములు, ఇంకా గ్రామ సర్వీసు ఇనాం భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం కూడా తొలగించింది. ఈ మేరకు ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం కల్పిస్తూ ఉత్తర్వులు(జీవో 588) జారీ చేశారు. ఇకపై ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చిన భూములపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. వాటికి ఫ్రీహోల్డ్‌ హోదా రాగానే పట్టా భూములుగా పేర్కొంటూ రైతులు, హక్కుదారుల పేరిట నమోదుచే యాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో వేలాది మంది పేద రైతులకు మేలు చేకూరనుంది. ఆయా భూములకు భద్రతే కాదు ధర కూడా పెరగనుంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 8,694 ఎకరాల వరకూ ఫ్రీహోల్డ్‌ భూములున్నాయి. మండలాల వారీగా చూస్తే.. వీరఘట్టం మండలం నడిమికెల్ల, కంబర , అడారు రెవెన్యూ గ్రామాల్లో 53 ఎకరాల 46 సెంట్ల ఫ్రీహోల్డ్‌ భూములున్నాయి. బలిజిపేట మండలంలో 9.28 ఎకరాలు, సాలూరులో 190 ఎకరాలు, పాచిపెంటలో 20 ఎకరాలు, గరుగుబిల్లిలో 414 ఎకరాలు, పార్వతీపురంలో మూడు ఎకరాల చొప్పున మొత్తం 939 ఎకరాలు ఇనాం భూములు ఉన్నాయి. 2,589 మంది ఆ భూములను సాగు చేస్తున్నారు. అదే విధంగా అసైన్డ్‌ భూములు 16,201 ఎకరాల వరకూ ఉన్నాయి. 16,153 మంది చేతుల్లో ఉంది.

గత వైసీపీ హయాంలో..

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఇష్టారాజ్యంగా భూములను ఫ్రీహోల్డ్‌ జాబితాలో చేర్చారు. అప్పట్లో కొంతమంది వారిపేరున అధికారికంగా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. నిబంధనలను పక్కన పెట్టి పేదల భూములను హస్తగతం చేసుకున్నారన్న విమర్శలున్నాయి. కాగా జిరాయితీ భూములను కూడా ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో తమ భూములకు విముక్తి కల్పించాలని అప్పట్లో హక్కుదారులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేవారు. అయితే కూటమి ప్రభుత్వం నిషేధంలో పెట్టడంతో ఇలాంటి భూములు చాలా వరకు క్రయవిక్రయాలు జరగకుండా అగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిషేధాన్ని సడలించడంతో వీటన్నింటి ధరలు తిరిగి రెక్కలు తొడగనున్నాయి.

హర్షణీయం

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అసైన్డ్‌ భూములకు స్వేచ్ఛ లభించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల క్రయ విక్రయాలకు ఎన్నో ఇబ్బందులుండేవి. ప్రస్తుతం కూటమి సర్కారు వాటికి చెక్‌ పెట్టింది. దీంతో రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- భూస తౌడు, రైతు, మామిడిపల్లి, సాలూరు మండలం

=========================================

ఆనందంగా ఉంది

కూటమి సర్కారు తాజా నిర్ణయంతో ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై చుక్కల భూమి, గ్రామ సర్వీసు ఇనాం, షరతుల పట్టా భూములకు రిజిస్ర్టేషన్‌లు చేసుకునే అవకాశం లభించింది. దీంతో ఎంతో మంది రైతుల కష్టాలు తీరుతాయి.

- ఆముదాల పరమేశు, కూర్మరాజుపేట, సాలూరు మండలం

Updated Date - Sep 16 , 2026 | 11:30 PM