Share News

Class 10 Exams రేపటి నుంచి పది పరీక్షలు

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:07 PM

Class 10 Exams from Tomorrow జిల్లాలో సోమవారం నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు.

Class 10 Exams   రేపటి నుంచి పది పరీక్షలు
సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు చేసిన దృశ్యం

పార్వతీపురం/బెలగాం/సాలూరు రూరల్‌, మార్చి14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ జిల్లాలో మొత్తంగా 68 కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 10,646 మంది విద్యార్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర మౌలిక వసతులు కల్పించాం. 68 మంది సూపరిం టెండెంట్లు, 512 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్‌, ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించాం. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. వాటికి సమీపంలో ఉన్న జిరాక్స్‌ షాప్‌లను తప్పనిసరిగా మూసివేయాలి. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. హాల్‌ టికెట్‌ను చూపిస్తే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిం చొచ్చు. అరగంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష హాల్‌లోకి ఎవరు మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లరాదు. జిల్లాలో ఏ సెంటర్లు 30, బీ సెంటర్లు 17 , సీ కేంద్రాలు 21వరకూ ఉన్నాయి. కొన్ని సీ సెంటర్లులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. 18 స్టోరేజీ పాయింట్లలో ప్రశ్నపత్రాలు భద్రపరిచాం.’ అని తెలిపారు. కాగా పార్వతీపురం డిపో నుంచి 7, పాలకొండ నుంచి 3, సాలూరు నుంచి 4 ప్రత్యేక బస్సులను పాఠశాలల నుంచి పరీక్ష కేంద్రాలకు నడుపుతున్నట్టు ఆర్టీసీ డీపీటీవో కె.శ్రీనివాసరావు శనివారం తెలిపారు.

నేడు 1,417 కేంద్రాల్లో ఉల్లాస్‌ పరీక్ష

గరుగుబిల్లి, మార్చి14(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉల్లాస్‌ అక్షరాంధ్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు వయోజన విద్యాశాఖ ఏడీ టి.వైకుంఠరావు తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఈ పరీక్షల నిర్వహణకు 1,417 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో 1,462 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. మొత్తంగా 67,686 మంది అభ్యాసకులు ఉల్లాస్‌ పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు. ప్రశ్న పత్రాలను మండలాలకు తరలించామన్నారు. మండల వెలుగు ఏపీఎంల ఆధ్వర్యంలో వాటిని పంపిణీ చేస్తామని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:07 PM