Share News

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:06 PM

జిల్లాలో సోమవారం నుంచి ఏప్రిల్‌ ఒకటో తేది వరకూ జరిగే పరీక్షల కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
సాలూరు మండలం కొత్తవలసలోని పరీక్ష కేంద్రం

జిల్లాలో 68 కేంద్రాల్లో నిర్వహణ

హాజరు కానున్న 10,646 మంది విద్యార్థులు

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సాలూరు రూరల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ): జిల్లాలో సోమవారం నుంచి ఏప్రిల్‌ ఒకటో తేది వరకూ జరిగే పరీక్షల కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 68 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 10,646 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర మౌలిక వసతులు కల్పించారు. 68 మంది సూపరింటెండెంట్లు, 512 మంది ఇన్విజిలేటర్లు, మూడు ఫ్లయింగ్‌, ఐదు సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. హాల్‌ టికెట్‌ను చూపిస్తే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో (పల్లెవెలుగు,ఆలా్ట్ర పల్లె వెలుగు ) ఉచితంగా ప్రయాణించి పరీక్ష కేంద్రాలక చేరుకోవచ్చు. అరగంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష హాల్‌లోకి ఎవరూ మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్లరాదు. 14 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. సాలూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం డీఈవో పి.బ్రహ్మాజీరావు పరిశీలించారు.

కిలో మీటర్లు ప్రయాణిస్తేనే పరీక్ష కేంద్రాలు..

సాలూరు మండలం కొత్తవలస గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో కురుకూటి, తోణాం, మావుడి, అంటివలస, మామిడిపల్లి గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే, వీరు ప్రతిరోజూ సుమారు 8 నుంచి 10 కిలోమీటర్లు రాకపోకలు సాగించాల్సి ఉంది. అదే విధంగా ఖరాసవలస, మామిడిపల్లికి చెందిన విద్యార్థులు 9 కిలోమీటర్లు ప్రయాణించి బొడ్డవలస కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. పెదబోరబంద, బాగువలస, శివరాంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాలూరులోని వివిధ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలంటే 10 కిలోమీటర్లు రాకపోకలు సాగించాల్సి ఉంది. సాలూరు-మక్కువ రోడ్డు బాగోలేకపోవడంతో ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో తిరగడం లేదు. విద్యార్థులు ఆటోలను ఆశ్రయించి సాలూరుకు రావాల్సి ఉంది.

Updated Date - Mar 15 , 2026 | 11:06 PM