Civil Supplies Department is against two పౌరసరఫరాల శాఖలో ఇద్దరిపై వేటు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:02 AM
Civil Supplies Department is against two పౌర సరఫరాల శాఖలో అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విధుల్లో అలసత్వం ప్రదర్శించి రేషన్ సరుకులు పక్కదారి పట్టించేందుకు కారణమైన పౌరసరఫరాల గోదాం ఇన్‌చార్జిని విధుల నుంచి తొలగించింది. రూ.28 లక్షలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. కంప్యూటర్ ఆపరేటర్‌ను బదిలీ చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
పౌరసరఫరాల శాఖలో
ఇద్దరిపై వేటు
గోదాం ఇన్‌చార్జిని ఉద్యోగం నుంచి తొలగింపు
కంప్యూటర్ ఆపరేటర్‌కు బదిలీ
ధ్రువీకరించిన తహసీల్దార్
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
రాజాం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):
పౌర సరఫరాల శాఖలో అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విధుల్లో అలసత్వం ప్రదర్శించి రేషన్ సరుకులు పక్కదారి పట్టించేందుకు కారణమైన పౌరసరఫరాల గోదాం ఇన్‌చార్జిని విధుల నుంచి తొలగించింది. రూ.28 లక్షలు రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. కంప్యూటర్ ఆపరేటర్‌ను బదిలీ చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
రాజాం పౌరసరఫరాల శాఖ గోదాం ఇన్‌చార్జిగా శ్రీనివాసరావు పనిచేస్తుండేవారు. ఆయన నిత్యం మద్యం తాగి రావడం, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడంతో దాదాపు రూ.28 లక్షల రేషన్ సరుకులు పక్కదారి పట్టాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శోభన్‌బాబు పాత్ర ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి. కాగా శాఖాపరమైన బదిలీల్లో భాగంగా గత ఏడాది నవంబరు 25న రాజాం పౌరసరఫరాల గోదాం ఇన్‌చార్జిగా సంతకవిటి సివిల్ సప్లయ్ డీటీ గంగాభవాని నియమితులయ్యారు. అయితే బాధ్యతలు అప్పగించకుండా గోదాం ఇన్‌చార్జి శ్రీనివాసరావు ఇబ్బందిపెట్టారు. దీంతో ఒక్కో బాగోతం బయటకు వచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో కథనం వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టారు. 560 బస్తాల బియ్యం, 19 బస్తాల పంచదార, 10 బస్తాల కందిపప్పు, 388 నూనె ప్యాకెట్లు, మూడు కిలోల సన్నబియ్యం ప్యాకెట్లు 108 మాయం అయినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లడంతో చర్యలకు దిగారు. శ్రీనివాసరావును ఉద్యోగం నుంచి తొలగించారు. అతని నుంచి రూ.28 లక్షల రికవరీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇంకోవైపు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శోభన్‌బాబుపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదేశాలు వచ్చినట్టు రాజాం తహసీల్దారు ధ్రువీకరించారు.
- ఇదే విషయమై సివిల్‌సప్లయ్ డీఎంను వివరణ కోరగా చెప్పడానికి నిరాకరించారు, పౌరసరఫరాల శాఖ గోదాం ఇన్‌చార్జిని ఉద్యోగ బాధ్యతల నుండి తొలగించినట్లు సిబ్బంది ద్వారా తెలిసింది. ఆయన గైర్హాజరులో ఉన్నట్టు సమాచారం.