Share News

Cigarette syndicates! సిగరెట్‌ సిండికేట్లు!

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:03 AM

Cigarette syndicates! ప్రభుత్వం ఏదైనా వస్తువుపై పన్ను పెంచుతుందంటే చాలు.. మార్కెట్‌లో ఆ వస్తువు ధర కొండెక్కెతుంది. చాలా వరకూ సరుకును వ్యాపారస్థులు ముందుగానే బ్లాక్‌ చేసేస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి విజయనగరం జిల్లాలో కన్పిస్తోంది.

Cigarette syndicates! సిగరెట్‌ సిండికేట్లు!

సిగరెట్‌ సిండికేట్లు!

త్వరలో పెరగనున్న ధరలు ?

అప్పుడే బ్లాక్‌ దందా మొదలు

అధిక ధరలకు విక్రయాలు

ఉన్న సరుకు గోదాముల్లోనే..

రేట్లు పెరిగాక బయటకు..?

విజయనగరం రింగురోడ్డు, జనవరి 21(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం ఏదైనా వస్తువుపై పన్ను పెంచుతుందంటే చాలు.. మార్కెట్‌లో ఆ వస్తువు ధర కొండెక్కెతుంది. చాలా వరకూ సరుకును వ్యాపారస్థులు ముందుగానే బ్లాక్‌ చేసేస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి విజయనగరం జిల్లాలో కన్పిస్తోంది. సిగరెట్లపై పన్ను పెంచుతున్నట్టు జనవరి తొలి వారంలోనే వార్తలోచ్చాయో.. లేదో? అప్పుడే బ్లాక్‌ దందా మొదలెట్టేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సిగరెట్లపై ఎక్సైజ్‌ సుంకం పెరగవచ్చుననే ప్రచారంతో జిల్లాలోని హోల్‌సేల్‌, చిల్లర వ్యాపారులు సిగరెట్లను గోదాములకు పరిమితం చేశారు. ఇప్పటికే వున్న నిల్వలను బయటకు తీయకుండా ‘స్టాక్‌ లేదు’ అనే బోర్డు తగిలిస్తూ తెరవెనుక భారీగా దోచుకుంటున్నారు.

కీలకమార్పులు ఇవే

- ఇప్పటి వరకూ సిగరెట్లపై వున్న ‘జీఎస్‌టీ పరిహారక సెస్‌’ రద్దయి దాని స్థానంలో కొత్తగా ఎక్సైజ్‌ సుంకాన్ని ప్రవేశపెట్టనున్నారు.

- కొత్త విధానంలో సిగరెట్‌ పొడవును బట్టి పన్ను మారుతుంది.

- 65 ఎంఎం లోపు చిన్న సిగరెట్లపై వెయ్యిస్టిక్స్‌కు సుమారు రూ.2,050 పన్ను పడనుంది.

- 70--75 ఎంఎం కింగ్‌ సైజు లేదా ప్రీమియం సిగరెట్లపై వెయ్యి స్టిక్స్‌కు ఏకంగా రూ.5,400 నుంచి రూ.8,500 వరకూ పన్ను విధించనున్నారు

- అలాగే జీఎస్‌టీ కూడా ప్రస్తుతం ఉన్న 28 శాతం నుంచి 40 శాతానికి పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇక చిన్న సిగరెట్లు విషయానికి వస్తే ఒక్కో స్టిక్‌ మీద రూ.2 నుంచి రూ.2.10 పైసలు పెరగవచ్చు.

- మీడియం సైజులో ఒక్కో స్టిక్‌ మీద రూ.3.50 పైసల నుంచి రూ.4.00 వరకు భారం పడే అవకాశం ఉంది.

- ప్రీమియం లేదా కింగ్‌ సైజుల్లో ఒక్కో స్టిక్‌పై రూ.5 నుంచి రూ.8 వరకూ ధర పెరిగే అవకాశం ఉంది.

- ప్రస్తుతం రూ.18 వున్న సిగరెట్‌ ధర రూ.22 లేదా రూ.23కు పెరగవచ్చు.

తగ్గితే ఇవ్వరు.. పెంచితే వదలరు

సాధారణంగా ప్రభుత్వం ఏదైనా వస్తువుపై జీఎస్టీ తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం సామాన్య వినియోగదారుడికి చేరాలంటే నెలల తరబడి సమయం పడుతుంది. పాత స్టాక్‌ అయిపోలేదు. కొత్త ధరల పట్టిక రాలేదు. అంటూ కుంటిసాకులు చెప్పే వ్యాపారులు పన్ను పెంచే విషయానికి వస్తే మాత్రం గంటల వ్యవధిలోనే ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఇటీవల పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించినా జిల్లాలో నేటికీ పాత ధరలకే విక్రయిస్తున్న దాఖలాలు ఉన్నాయి. సిగరెట్ల విషయంలో మాత్రం బడ్జెట్‌ రాకముందే పన్ను పెరగకముందే పెరగబోయే ధరను ఇప్పుడే వసూలు చేస్తూ వినియోగదారులను నిలువునా ముంచుతున్నారు. నగరం మొదలుకుని మారుమూల ఏజెన్సీ ప్రాంతం వరకూ ఈ ’పొగ’ వ్యాపారం జోరుగా సాగుతోంది.

సిగరెట్లలోనూ సిండికేట్‌ ’ బ్రాండ్‌’

జిల్లాలోని కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కిళ్లీకొట్టు యాజమానులకు కోటా పద్ధతిలో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ వున్న ప్రముఖ బ్రాండ్ల సిగరెట్లను కావాలనే పక్కన పెడుతున్నారు.

ఉఫ్‌ ఉఫ్‌ అంటూ ఊదాల్సిందే!

జిల్లాలో సిగరెట్‌ ప్రియులు ఎక్కువ మందే ఉన్నారు. రోజుకు రూ.10 లక్షలకు పైగా సిగరెట్లు అమ్ముడవుతాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా సిగరెట్లపై వెచ్చించే డబ్బులు సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. వ్యాపారస్థులు ఒక్కో స్టిక్‌పై రూ.2 నుంచి రూ.5 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే ఒక ప్యాకెట్‌పై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం అధిక ధరల రూపంలో కొంతమంది ముఖ్య వ్యాపారులు రోజుకు రూ.5 లక్షలు పైగా దండుకుంటున్నారు. గత 15 రోజుల నుంచి సిగరెట్‌ ధరలను అమాంతం పెంచేశారు. అంటే ఇప్పటికే ధూమపాన ప్రియులు అదనపు ధర రూపంలో నష్టపోయిన మొత్తం రూ.80 లక్షల పైమాటే.

నిఘా ఏదీ?

ఈ దోపిడీ బహిరంగంగా సాగుతున్నా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంటు, వాణిజ్యపన్నుల శాఖాధికారులు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. గత ఏడాది కూడా బడ్జెట్‌ సమయంలో ఇలాగే ధరలు పెంచి కోట్ల రూపాయలు గడించారు. ప్రభుత్వం పన్నులు పెంచేది ఖాజానాను నింపుకోవడానికి అయితే, వ్యాపారులు పన్నులు పేరుతో ముందే దోచుకుంటూ సొంత ఖాజానాలు నింపుకుంటున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే కేంద్ర బడ్జెట్‌ అమలు నాటికి రూ.3 కోట్లకు పైగా వినియోగదారులు అదనపు ధర రూపంలో నష్టపోవలసి ఉంటుంది.

నిఘా పెట్టాం

నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్‌, వాణిజ్యపన్నులశాఖ, విజయనగరం

బడ్జెట్‌ ముందస్తు అంచనాలతో ధరలు పెంచడం చట్ట విరుద్ధం. ప్రభుత్వం అధికారికంగా రేట్లు పెంచే వరకూ పాత ధరలకే విక్రయించాలి. జీఎస్‌టీ తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయని వ్యాపారులపై ఇప్పటికే నిఘా పెట్టాం. సిగరెట్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టించి ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే మాకు ఫిర్యాదు చేయవచ్చు.

===============

Updated Date - Jan 22 , 2026 | 12:03 AM