Share News

అంపావల్లిలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:20 PM

బలిజిపేట మండలం అంపావల్లి వాటర్‌ పంపు హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం క్లోరిన్‌ గ్యాస్‌ లీకైంది.

అంపావల్లిలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

- ఆరుగురికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

- అప్రమత్తమైన యంత్రాంగం

పార్వతీపురం/సీతానగరం (బలిజిపేట), ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బలిజిపేట మండలం అంపావల్లి వాటర్‌ పంపు హౌస్‌లో ఆదివారం మధ్యాహ్నం క్లోరిన్‌ గ్యాస్‌ లీకైంది. దీంతో గ్రామానికి చెందిన రాగా రాధ, బొందు సురేష్‌, బొందు మురళీకుమారి, కామేశ్వరి, కుమారి, సుధాకర్‌ అస్వస్థతకు గురయ్యారు. వారిని తక్షణమే బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యాధికారి క్రాంతి కిరణ్మయి చికిత్స అందించారు. అనంతరం రాధ, సురేష్‌, మురళీకుమారిని మెరుగైన చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. కాగా, అంపావల్లిలో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్త మైంది. పంపుహౌస్‌లో నిల్వ ఉంచిన పాత క్లోరిన్‌ సిలిండర్ల నుంచి గ్యాస్‌ లీకైనట్లు అధికారులు గుర్తించారు. పంప్‌హౌస్‌కు దాదాపు 10 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లల్లో నివసించే వారు ఈ గ్యాస్‌ను పీల్చడంతో ఆరుగురు ఆయాసం, కళ్లు తిరగడం, గొంతు మంట, కొద్దిపాటి దగ్గు లక్షణాలతో ఇబ్బంది పడినట్టు కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. లీక్‌ అవుతున్న పాత సిలిండర్లను ఏఈ ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెప్పారు.

Updated Date - Feb 15 , 2026 | 11:21 PM