ప్రభుత్వ బడుల్లో ఐఏఎస్‌ల పిల్లలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:42 PM
ఐఏఎస్ అధికారులు సాధారణంగా తమ పిల్లలను ఏ కార్పొరేట్ స్కూల్‌లో గానీ, ప్రైవేట్ స్కూల్‌లో గానీ చదివిస్తుంటారు.
- బెలగాం డీవీఎం పాఠశాలలో చేరిన కలెక్టర్ కుమారుడు
- మధ్యాహ్న భోజనం కూడా అక్కడే
- ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ ప్రభాకర్‌రెడి
- గతంలో పలువురు ఐఏఎస్‌ల పిల్లలు కూడా ఇలాగే చదివారు
పార్వతీపురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఐఏఎస్ అధికారులు సాధారణంగా తమ పిల్లలను ఏ కార్పొరేట్ స్కూల్‌లో గానీ, ప్రైవేట్ స్కూల్‌లో గానీ చదివిస్తుంటారు. అయితే, కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ఉదాహరణే ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి. ఈయన తన కుమారుడిని బెలగాంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈయనే కాదు జిల్లాలో గతంలో కలెక్టర్‌గా పని చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు లక్ష్మీషా, కూర్మనాథ్ కూడా తమ పిల్లలను సర్కారు బడికి పంపించారు. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలపై ఎంతో నమ్మకం ఏర్పడుతుంది.
- జిల్లా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు ఎన్.క్రిష్‌ధరణ్‌రెడ్డిని బెలగాంలోని డీవీఎం పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. క్రిష్‌ధరణ్‌రెడ్డి విజయవాడలోని పడమట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. పదో తరగతికి డీవీఎం పాఠశాలలో ప్రవేశం పొందారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేస్తున్నారు. తండ్రి కలెక్టర్ అయినప్పటికీ తమతోనే చదువుకుంటూ తమతోనే భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అంటున్నారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరాలనే నినాదంతో కలెక్టర్ ముందుగా తన కుమారుడిని చేర్పించి ఆదర్శంగా నిలిచారు.
-2018లో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా విధులు నిర్వహించిన లక్ష్మీషా (ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్) తన కుమార్తెను అప్పట్లో బెలగాం అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆయన సతీమణి స్వయంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి కుమార్తెను తీసుకెళ్లేవారు.
- 2020లో పార్వతీపురం ఐటీడీఏ పీవోగా పని చేసిన కూర్మనాథ్ (ప్రస్తుతం సీసీఎల్‌ఏ డైరెక్టర్) తన కుమారుడిని స్థానిక కేపీఎం పాఠశాలలో తొమ్మిది నుంచి పదో తరగతి వరకు చదివించారు. 2022లో ఇంటర్ ఫస్టియర్ కూడా సీతంపేట మండలం జోగింపేట గిరిజన జూనియర్ కాలేజీలో చదివించారు.
- 2025లో జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన శ్యాంప్రసాద్( ప్రస్తుతం సత్యసాయి జిల్లా కలెక్టర్) తన కుమారుడిని అప్పట్లో స్థానిక కేపీఎం పాఠశాలలో ఆరో తరగతి చదివించారు.
స్ఫూర్తిగా తీసుకోవాలి..
ఐఏఎస్ అధికారులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ, చాలామంది అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు తమ పిల్లలను కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్న పరిస్థితి జిల్లాలోని ఉంది. ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.