Share News

Children beware! పిల్లలు జాగ్రత్త!

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:16 AM

Children beware! విద్యార్థుల్లో సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. శనివారం నుంచి పండగ సెలవులు ఇచ్చేయడంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చునని, స్నేహితులతో ఆటలు ఆడుకోవచ్చునని సంబరపడుతున్నారు. అయితే ఆ ఆనందంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మానసిక వేత్తలు చెబుతున్నారు. పెద్దవారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చునని, మానసిక ఎదుగుదల ఉంటుందని సూచిస్తున్నారు. సంక్రాంతి ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిదంటున్నారు.

Children beware! పిల్లలు జాగ్రత్త!

పిల్లలు జాగ్రత్త!

నేటి నుంచి సంక్రాంతి పండగ సెలవులు

విద్యార్థులంతా స్వగ్రామాలకు పయనం

చెరువుల్లో దిగాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలి

బైక్‌ రైడింగ్‌ వైపు మొగ్గు చూపొద్దు

అమ్మమ్మ, తాతయ్యతో గడిపితే ఎంతో ఆనందం

విద్యార్థుల్లో సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. శనివారం నుంచి పండగ సెలవులు ఇచ్చేయడంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లొచ్చునని, స్నేహితులతో ఆటలు ఆడుకోవచ్చునని సంబరపడుతున్నారు. అయితే ఆ ఆనందంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మానసిక వేత్తలు చెబుతున్నారు. పెద్దవారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చునని, మానసిక ఎదుగుదల ఉంటుందని సూచిస్తున్నారు. సంక్రాంతి ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిదంటున్నారు.

రాజాం, జనవరి 9(ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది పల్లెలు. పండగ సంప్రదాయాలు గ్రామాల్లోనే తొణికిసలాడతాయి. వాటిని కనుల విందుగా చూడాలని పిల్లలూ ఉవిళ్లూరుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. గ్రామాల్లో ఉంటున్న పిల్లలకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉంటుంది కానీ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారికి ఉండదు. అలా ప్రమాదాల బారిన పడుతుండడం ఏటా చూస్తున్నాం. అందుకే సంక్రాంతి సమయాల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలవులు అనగానే పిల్లలకు పట్టలేని ఆనందం వస్తుంది. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారుచేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి కన్నవారికి కడుపుకోతను మిగులుస్తాయి. పాఠశాలలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు. పైగా తరగతులు, సిలబస్‌ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉంటారు. సంక్రాంతి సెలవులు అనేసరికి అధిక సమయం ఖాళీగా దొరుకుతుంది. అప్పుడే పిల్లలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారు.

ఈత సరదా ఉంటే..

సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎక్కువగా ఈతపై దృష్టి పెడుతుంటారు. చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్తుంటారు. ప్రస్తుతం అన్నింటా నీరు పుష్కలంగా ఉంది. మారిన జీవన విధానంతో గ్రామీణ ప్రాంత పిల్లలకే ఈత వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఈత తెలియదు. అటువంటి వారు గ్రామాలకు వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఈతకు వెళుతుంటారు. ఈ క్రమంలో ఈతరాక ప్రమాదాలకు గురవుతుంటారు. అటువంటి వారి విషయంలో తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. అందుకే సెలవులకు వచ్చే పిల్లలకు ప్రమాదకరమైన చెరువులు, కాలువలు, కుంటల గురించి చెప్పాలి. అటువైపుగా వెళ్లినప్పుడు పెద్దవారిని తోడు తీసుకువెళ్లాలని చెప్పాలి.

వాహన రైడింగ్‌కు దూరంగా ఉంచాలి..

ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం ఉంటోంది. మధ్యతరగతి కుటుంబాల్లో సైతం కారు అందుబాటులోకి వచ్చింది. సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావమో కానీ..పిల్లలు రైడింగ్‌ ట్రెండింగ్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో ఉన్న వాహనాలను తీసుకొని రోడ్లపైకి వస్తున్నారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రత పాటించడం లేదు. అతి వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ఒక్కోసారి వీరి కారణంగా ఎదుటి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. అందుకే పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ వాహనం నడిపే అర్హత ఉంటే పూర్తిగా అవగాహన, అవసరం మేరకు మాత్రమే వారి చేతికి వాహనం ఇవ్వాలి.

సెల్‌ఫోన్ల వినియోగం మించొద్దు

పిల్లలకు సెల్‌ఫోన్లపై విపరీతమైన అవగాహన ఉంటోంది. అందులో ఉండే యాప్స్‌ గురించి వారికి ఇట్టే తెలిసిపోతోంది. ఆన్‌లైన్‌ తరగతులు, అదనపు పరిజ్ఞానం కోసమంటూ చాలా మంది తమ పిల్లల చేతిలో సెల్‌ఫోన్లు పెడుతుంటారు. అయితే దాంతో ఎంత ప్రయోజనమో చెప్పలేం కానీ అనర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫొటోల యాప్స్‌ మొదలు ఆన్‌లైన్‌ గేమ్స్‌ వరకూ అన్ని యాప్‌ల గురించి తెలుసుకుంటున్నారు. సోషల్‌మీడియాలో అకౌంట్లు తెరుస్తున్నారు. వారు నేర్చుకునే విషయాలు ఎటువైపునకు దారితీస్తాయో అనేది తల్లిదండ్రులు గ్రహించాలి. అందుకే పిల్లలకు ఈ సెలవుల్లో అవసరానికి మేరకు మాత్రమే సెల్‌ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

మత్తుతో చిత్తు..

జిల్లాలో మైనర్లు, విద్యార్థులు మత్తు బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్‌ అలవాటు ఉంటే మిగతా వారు ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారే ఏమీకాదులే అనే ప్రోత్సాహం మత్తులోకి బలంగా దించుతోంది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో సైతం ఇప్పుడు పార్టీ కల్చర్‌ నడుస్తోంది. సరదాగా ఒకసారి అనే మాటతో మొదలై.. మత్తు అనే మాయలో పడేస్తోంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

తల్లిదండ్రులూ అప్రమత్తం

సంక్రాంతి సెలవుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఎన్నో విషాద ఘటనలు జరిగాయి. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వారిపై ఒక కన్నేసి ఉంచాలి. బైక్‌లతో పాటు సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిదే. వారికి ఆడుకోవడానికి స్వేచ్ఛనివ్వడమే కాకుండా.. వారిని కుటుంబసభ్యులు కనిపెట్టుకొని ఉండాలి.

- సీహెచ్‌ ఉపేంద్ర, సీఐ, రాజాం

Updated Date - Jan 10 , 2026 | 12:17 AM