“Child… Let’s Go Home! బిడ్డా.. ఇంటికెళ్దాం రా!
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:10 AM
“Child… Let’s Go Home! ఎంతో హుషారుగా ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లిన ఆ గిరిజన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విద్యుదాఘాతానికి గురై పాఠశాల సమీపంలోనే మరణించాడు. కన్న బిడ్డ విగతజీవిగా మారడం చూసి.. ఆ తల్లి కన్నీరుమున్నీ రైంది. ‘కొడుకా .. ఇంటికెళ్దాం రా!’ అంటూ భోరున రోదించింది.
తల్లడిల్లుతున్న తల్లి
మామిడిపల్లిలో ఘటన
ఉదయమే హుషారుగా బడికి వెళ్లిన కొడుకు
గంటల్లోనే నిర్జీవమై కనిపించడాన్ని చూసి
ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది
ఇంటికి రాగానే అమ్మా అని హత్తుకునే వాడు
శాశ్వతంగా దూరమయ్యేసరికి విలవిల్లాడిపోయింది
‘ఒరే కొడుకు ఇంటికెళ్తాం రారా..’ అని రోదించింది
నా కొడుకు కావాలంటూ అక్కడున్నవారిని వేడుకుంది
=================================
సాలూరు రూరల్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఎంతో హుషారుగా ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లిన ఆ గిరిజన విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విద్యుదాఘాతానికి గురై పాఠశాల సమీపంలోనే మరణించాడు. కన్న బిడ్డ విగతజీవిగా మారడం చూసి.. ఆ తల్లి కన్నీరుమున్నీ రైంది. ‘కొడుకా .. ఇంటికెళ్దాం రా!’ అంటూ భోరున రోదించింది. ఈ విషాదకర ఘటన శని వారం మామిడిపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కె.కరకవలసకు చెందిన గిరిజన విద్యార్థి కొర్ర దిలీప్(14) మామిడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్వగ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు రోజూలానే హుషారుగా వచ్చాడు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విన్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దిలీప్‌తో పాటు మరో విద్యార్థులు ఎస్.ప్రవీణ్, ఎం.వాసు పాస్‌కి అని చెప్పి ఉపాధ్యాయుడిని అనుమతి అడిగి బయటకు వచ్చారు. వారిలో దిలీప్ పాఠశాల ప్రహరీ దూకి మూత్ర విసర్జన చేశాడు. అయితే తిరిగి గోడ ఎక్కి పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం పట్టుకొని గోడ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే పక్కనే అరటితోట బోరు కోసం వేసిన ప్యానెల్ బోర్డు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే పాఠశాల సిబ్బంది దిలీప్‌ను మామిడిపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ చెప్పారు. ఆయనతో రూరల్ ఎస్.ఐ రవీంద్రరాజు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి శనివారం రాత్రి మామిడిపల్లి చేరుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. దీనిపై నివేదిక అందించాలని రెవెన్యూ, ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.
మరో అరగంటలో వస్తాడనుకుంటే..
కె.కరకవలసకు చెందిన ఆదినారాయణ, తల్లి సన్యాసమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె సాలూరులో డిగ్రీ చదువుతుంది. కుమారుడు దిలీప్ మామిడిపల్లిలో చదువుతున్నాడు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న వారు దిలీప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాగా చదివి కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించారు. కానీ ఇంతలో ఇలా జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం ఉదయం ఏడు గంటలకు ఇంటి నుంచి బడికెళ్లిన దిలీప్ మధ్యాహ్నం 12:30 గంటలకు పాఠశాలలో భోజనం చేసి ఒంటి గంటకు తిరిగి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంతలోనే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ‘నా కొడుకు.. నాకు కావాలి.’ అంటూ తల్లి సన్యాసమ్మ రోదిస్తుండడం చూసి.. అక్కడున్న వారు సైతం కన్నీటిపర్యమతమయ్యారు. బాలుడు దిలీప్ ఆకస్మిక మృతితో కె.కరకవలసలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా పాస్‌కు అనుమతి అడిగి వెళ్లిన కొద్దిసేపటికే విద్యుత్ షాక్‌తో విద్యార్థి మరణించడం తమను, ఉపాధ్యాయ సిబ్బందిని కలచివేసిందని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు కోట అయ్యప్ప విచారం వ్యక్తం చేశారు.