28న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:15 AM
ఈ నెల 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు.
- రావివలసలో పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఈ నెల 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. చీపురుపల్లి మండలం రావివలస గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి కేటాంచిన విధులు వారు సక్రమంగా, సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. గతంలో సీఎం చంద్రబాబు దత్తి గ్రామానికి పర్యటనకు వచ్చేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, ఈసారి ఎటువంటి లోపాలు జరగకుండా చూడాలని అన్నారు. ‘ప్రధానంగా బందోబస్తు, శాంతి భద్రతలను పోలీసు శాఖ చూసుకోవాలి. హెలిపాడ్, వేదిక వద్ద ఏర్పాట్లను అన్నిశాఖల అధికారుల సమన్వయంతో చీపురుపల్లి ఆర్డీవో చూసుకోవాలి. వాహనాలు, సిబ్బందికి అవసరమయ్యే డ్యూటీ పాస్‌లను జారీ చేయాలి. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రహదారులపై గుంతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖధికారులదే. పింఛన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడతారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా ఉండేలా డీఆర్‌డీఏ పీడీ చూడాలి. సీఎం సెక్యూరిటీ టీమ్‌కు భోజనం, నివాస ఏర్పాట్లను విజయనగరం ఆర్డీవో పర్యవేక్షించాలి. ప్రజావేధిక వద్ద 3 వేల మందికి సిట్టింగ్ ఏర్పాట్లను పోలీసుల సహకారంతో చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలి. మంచి కండిషన్‌లో ఉన్న అంబులెన్స్‌లు, అత్యవసర వైద్యానికి వైద్యులు, మందులతో వేదిక సమీపంలో సేఫ్ హౌస్‌ను ఏర్పాటు చేయాలి. కాన్వాయ్ వాహనాలను ఏర్పాటు చేయాలి.’ అని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ సేతుమాధన్, డీఆర్‌వో మురళి, సీపీవో బాలాజీ పాల్గొన్నారు.
సభాస్థలం పరిశీలన..
చీపురుపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రావివలస సమీపంలోని పైలపేట వద్ద సీఎం సభా స్థలాన్ని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా, స్థానిక అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీవో ప్రమీలా గాంధీ, డీఎస్పీ ఎస్.రాఘవులు, తహసీల్దార్ డి.ధర్మరాజు, ఎంపీడీవో ఐ.సురేష్, ఇతర అధికారులు ఉన్నారు.