Contaminated Water చెలకమెండంగి .. కలుషిత నీరే గతి
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:34 PM
Chelakamendangi… Contaminated Water is the Only Option పనసభద్ర పంచాయతీ పరిధి చెలకమెండంగి గిరిశిఖర గ్రామస్థులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే చాలు.. వారు బురదనీటినే తాగాల్సి వస్తోంది. మొత్తంగా ఇక్కడున్న సుమారు 30 గిరిజన కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
వర్షం పడితే బురదనీరే శరణ్యం
ఎండలు ముదిరితే.. తాగునీటికి కటకటే..
మక్కువ రూరల్, ఏప్రిల్10(ఆంధ్రజ్యోతి): పనసభద్ర పంచాయతీ పరిధి చెలకమెండంగి గిరిశిఖర గ్రామస్థులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే చాలు.. వారు బురదనీటినే తాగాల్సి వస్తోంది. మొత్తంగా ఇక్కడున్న సుమారు 30 గిరిజన కుటుంబాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వాస్తవంగా గ్రామం సమీపంలోని కొండల మధ్య వచ్చే నీరే వారికి ఆధారం. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖాధికారులు కొండల నుంచి వచ్చే నీటిని పైపుల ద్వారా గ్రామంలోని కుళాయిల పాయింట్లకు అందేలా గతంలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం చిన్నపాటి కుండీ నిర్మించారు. కొండ నుంచి వచ్చే నీటిని అందులో నిల్వచేసి, కుండీ పైపు ద్వారా గ్రామ ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తుండడంతో కొండల నుంచి వచ్చే ఊట నీరు తగ్గిపోయింది. దీంతో ఆ గ్రామ గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతంతో పాటు ఇటీవల జిల్లాలో వర్షాలు కురవడంతో కొండపైన చెత్తా, మట్టితో కలిసిన బురద నీరు కుండీలో చేరుతుంది. మరో గత్యం తరం లేని పరిస్థితుల్లో కలుషితమైన నీటినే ఆ గ్రామ గిరిజనులు వినియోగించాల్సి వస్తోంది. ఏటా ఈ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, బురద నీటితో తరచూ రోగాలపాలవుతున్నామని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా వారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పీఎంకే రెడ్డిను వివరణ కోరగా.. ‘చెలకమెండంగి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై దృష్టి సారిస్తాం. నీరు కలుషితమవకుండా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.