Cheated బంగారం పేరుతో టోకరా!
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:13 AM
Cheated in the Name of Gold! బంగారం పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. తక్కువ ధరకే తాకట్టు బంగారం ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఇది నమ్మి ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుంచి వచ్చారు. వారిపై గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి దాడిచేసి రూ.2లక్షలు లాక్కొని పరారయ్యాడు.
విజయవాడ నుంచి పార్వతీపురానికి వచ్చిన బాధితులు
రూ.2లక్షలు లాక్కొని పరారైన వైనం
పోలీసులకు ఫిర్యాదు
బెలగాం/పార్వతీపురం రూరల్, జూన్7(ఆంధ్రజ్యోతి): బంగారం పేరుతో ఓ వ్యక్తి టోకరా వేశాడు. తక్కువ ధరకే తాకట్టు బంగారం ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఇది నమ్మి ఇద్దరు వ్యక్తులు విజయవాడ నుంచి వచ్చారు. వారిపై గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి దాడిచేసి రూ.2లక్షలు లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన ఆదివారం పార్వతీపురం మండలం అడ్డూరు వలస వద్ద జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన రోహిణి శివకుమార్‌కు గుంటూరులో ఉన్న తన స్నేహితుడి ద్వారా పార్వతీపురానికి చెందిన రాజు పరిచయమయ్యాడు. గత నాలుగు రోజులుగా శివకుమార్‌కు రాజు ఫోన్ చేసి తక్కువ ధరకే తాకట్టు బంగారం ఇప్పిస్తానని చెప్పేవాడు. దీంతో నిజమేనని నమ్మి శివకుమార్ తన స్నేహితుడి దుర్గా శ్రీనివాస్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరి ఆదివారం ఉదయం 5.30కు పార్వతీపురం చేరుకున్నారు. ఇక్కడ ఓ లాడ్జీలో బస చేశారు. అనంతరం శివకుమార్.. రాజుకు ఫోన్ చేయగా పార్వతీపురం మండలం అడ్డూరువలస వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో శివకుమార్ తన స్నేహితుడితో కలిసి అడ్డూరువలసకు వెళ్లాడు. అక్కడ బంగారం ఇప్పిస్తానని, నగదు చూపించమని రాజు అడగ్గా.. శివకుమార్ తన వద్దనున్న రూ.2లక్షలు చూపించాడు. వెంటనే ఆయనతోపాటు స్నేహితుడిపై రాజు, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నగదు లాక్కొని పరారయ్యారు. దీనిపై బాధితులు పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యం తెలిపారు.