Share News

చంటిది ఆత్మహత్యే

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:11 AM

ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో అను మానాస్పదంగా మృతిచెందిన మత్స్యకారుడు మైలపల్లి చంటి ఆత్మహత్య చేసుకు న్నట్లు హార్బర్‌ ఏసీపీ చిట్టిబాబు తెలిపారు.

చంటిది ఆత్మహత్యే

విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో అను మానాస్పదంగా మృతిచెందిన మత్స్యకారుడు మైలపల్లి చంటి ఆత్మహత్య చేసుకు న్నట్లు హార్బర్‌ ఏసీపీ చిట్టిబాబు తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. గత నెల 7న కోస్టల్‌ జాలారిపేట వద్ద విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (30) మృతిచెందాడు. మృత దేహానికి నైలాన్‌తాడు బిగించి ఉండడం, ముఖంపై గాయంతో కూడిన రక్తపు మరకలు ఉండడంతో పాటు తనను ఎవరో వెంబడిస్తున్నారంటూ కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలియడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించి, 50 మందికి పైగా విచారణ చేసి సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో సీపీ శంఖబ్రతబాగ్చి సీఐ షేక్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణ జరిపి కోస్టల్‌ బ్యాటరీ నేవల్‌ అధికారుల సహాయంతో నేవీ సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించింది. ఇందులో చంటి మద్యానికి బానిసవడంతో భార్యతో విభేదాలు వచ్చాయని, అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తనను ఎవరో చంపేందుకు వస్తున్నారని సన్నిహితులకు చెప్పేవాడని గుర్తించారు. కాగా గత నెల7న అర్ధరాత్రి అక్కిరెడ్డిపాలేనికి చెందిన వారు శ్రీకృష్ణుని విగ్రహ నిమజ్జనానికి తీరానికి వచ్చారని, ఆ సమ యంలో చంటి మెడకు నైలాన్‌ తాడు బిగించుకొని, సముద్రం వైపు తీక్షణంగా చూశాడని, దీంతో భయపడ్డామని వారు పోలీసులకు తెలిపారు. అనంతరం అతడు కింద పడిపోవడంతో కర్రలు తగిలి చంటికి గాయాలైనట్టు గుర్తించారు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించామన్నారు. సమావేశంలో సిట్‌ దర్యాప్తు అధికారి హుస్సేన్‌, సీఐ వరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:11 AM