Pension Distribution పింఛన్ల పంపిణీలో మార్పులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:15 AM
Changes in Pension Distribution ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించింది. కేంద్రం పరిధిలో వాటాగా (నేషనల్ సోషల్ అసిస్టన్స్ ప్రోగ్రాం-ఎన్‌ఎస్‌ఏపీ) నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లోకి జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మిగిలిన మొత్తాన్ని పింఛన్‌దారులకు నేరుగా ఇంటి వద్దనే అందించనున్నారు.
కేంద్రం వాటా బ్యాంకు ఖాతాలో జమ
రాష్ట్ర సర్కారు అందించే మిగిలిన మొత్తం
లబ్ధిదారులకు ఇవ్వనున్న సిబ్బంది
గరుగుబిల్లి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించింది. కేంద్రం పరిధిలో వాటాగా (నేషనల్ సోషల్ అసిస్టన్స్ ప్రోగ్రాం-ఎన్‌ఎస్‌ఏపీ) నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లోకి జమ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మిగిలిన మొత్తాన్ని పింఛన్‌దారులకు నేరుగా ఇంటి వద్దనే అందించనున్నారు. వచ్చేనెల నుంచి నూతన విధానంలో పింఛన్లు పంపిణీ చేయాలని ఈ మేరకు జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ప్రతినెలా 1,36,787 వరకు వివిధ రకాల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 59 కోట్లు విడుదల చేస్తుంది. అయితే అక్టోబరు నుంచి వృద్ధాప్య పింఛన్‌కు సంబంధించి ఆయా లబ్ధిదారుల (60 నుంచి 79 సంవత్సరాలు) బ్యాంకు ఖాతాల్లో కేంద్రం వాటా కింద రూ. 200 జమ చేయనున్నారు. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కారు వాటా రూ. 3,800 వారికి నేరుగా అందించ నున్నారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి బ్యాంకులో రూ. 500 జమ చేస్తారు. మిగిలిన రూ. 3,500 నగదు చేతికి అందిస్తారు. వితంతు పింఛన్‌దారుల (40 నుంచి 79 సంవత్సరాలు) బ్యాంకు ఖాతాల్లో రూ. 300 జమ చేస్తారు. మిగిలిన రూ. 3,700 నేరుగా అందిస్తారు. దివ్యాంగ పింఛన్‌దారుల (18 నుంచి 79 సంవత్సరాలు)కు బ్యాంకు ఖాతాలో రూ. 300 జమ చేయగా, మిలిగిన రూ. 5,700 చేతికి అందిస్తారు. 80 సంవత్సరాలు పైబడిన వారికి బ్యాంకులో రూ. 500 జమ చేయగా మిగిలిన రూ. 5,500 నేరుగా అందించనున్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్‌దారులకు విధిగా ఆధార్ కార్డుతో లింకైన బ్యాంకు ఖాతాలు ఉండాలి. ఖాతాలు వినియోగంలో ఉండేలా చూసుకోవాలి. అయితే జిల్లాలో చాలామంది పింఛన్‌దారులకు బ్యాంకు ఖాతాలు లేవు. దీంతో నూతన విధానంలో కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ సీహెచ్ ప్రభావతిని వివరణ కోరగా.. ‘పింఛన్ నగదు పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కేంద్రం వాటా పింఛన్‌దారుల ఖాతాల్లో జమవుతుంది. రాష్ట్ర సర్కారు వాటాగా నగదు మొత్తం పింఛన్‌దారుల చేతికి అందిస్తారు. పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లేనట్లయితే సచివాలయాల పరిధిలో నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికీ ఖాతాలు లేనివారు త్వరితగతిన బ్యాంకులను సంప్రదించాలి. దీనిపై గ్రామస్థాయిలో పరిశీలన చేయాలని సచివాలయాల సిబ్బందిని ఆదేశించాం. ’ అని తెలిపారు.