Share News

Chance for Two Candidates ఇద్దరికి చాన్స్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:22 AM

Chance for Two Candidates మహానాడు వేదికగా వచ్చే ఎన్నికల్లో 33 శాతం టిక్కెట్లను మహిళలకే కేటాయిస్తామని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ చేసిన ప్రకటనను జిల్లా మహిళలు స్వాగతిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లుతో పని లేకుండా పార్టీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోకేష్‌ తెలిపారు. ఈ లెక్కన జిల్లాలో ఇద్దరు మహిళా అభ్యర్థులు పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Chance for Two Candidates ఇద్దరికి చాన్స్‌

  • జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు

  • కనీసం ఐదు ఎంపీపీ, జడ్పీటీసీలకు అవకాశం

  • నియోజకవర్గాలు పెరిగితే మాత్రం అదనం.. లేకుంటే యథాతధం

పార్వతీపురం, జూన్‌1(ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికగా వచ్చే ఎన్నికల్లో 33 శాతం టిక్కెట్లను మహిళలకే కేటాయిస్తామని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌ చేసిన ప్రకటనను జిల్లా మహిళలు స్వాగతిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లుతో పని లేకుండా పార్టీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోకేష్‌ తెలిపారు. ఈ లెక్కన జిల్లాలో ఇద్దరు మహిళా అభ్యర్థులు పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలుగా మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఉన్నారు. జిల్లాల పునర్విభజన జరిగితే నియోజకవర్గాల సంఖ్య నాలుగు నుంచి ఏడుకు పెరగనుంది. అప్పుడు మూడు స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.

జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. అయితే 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తే స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంతోమంది మహిళలు పోటీ చేయనున్నారు. కనీసం ఐదు నుంచి ఆరు ఎంపీపీ స్థానాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. జడ్పీటీసీలుగా కూడా ఐదు నుంచి ఆరు స్థానాల్లో మహిళలు ఎన్నికల బరిలో నిలవనున్నారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలుండగా.. ఇందులో ఒక స్థానం చైర్‌పర్సన్‌కు కేటా యించనున్నారు. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉంది.

జనగణన పూర్తయిన తరువాత మహిళలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. అయితే లోకేష్‌ మాత్రం 33 శాతం టిక్కెట్లు మహిళలకే అని చెప్పడంతో ఎక్కడికక్కడే నేతలు తమ కుమార్తెలను, కోడళ్లను, సమీప బంధువులుగా ఉన్న మహిళలను రంగంలోకి దించేందుకు చూస్తున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుచేస్తే ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించడం ఖాయంగా తెలుస్తోంది. జనగణన కొలిక్కి వచ్చిన తరువాత దీనిపై స్పష్టత రానుంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 15 వరకూ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మహిళలకు సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యేలు ఐదుగురు ఉన్నారు. నియోజకవర్గాలు తారుమారు అయినా వీరు మాత్రం ఆశా వహులుగా ఉండే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలుచేస్తే కచ్చితంగా తమ స్థానాలు పోతాయని ఉమ్మడి జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. అందుకే వారి భార్యలు, కుమార్తెలను సిద్ధం చేస్తున్నారు. పార్టీలో వివిధ పదవులు ద్వారా వారిని నియోజకవర్గాలకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఈ విషయంలో ముందుచూపుతో ఉన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 12:22 AM