Share News

Celebrations in Full Swing సందడిగా చైత్రోత్సవాలు

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:22 AM

Chaitra Festival Celebrations in Full Swing గిరిసీమల్లో ఇటుక పండుగ సందడి నెలకొంది. పార్వతీపురం, సాలూరు ఏజెన్సీలో ప్రాంతాల్లో సోమవారం ఈ వేడుకలు ఉత్సాహాంగా సాగాయి. ఈ పండుగను గిరిజనులు ఉగాది ( చైత్రోత్సవాలు) ఉత్సవాలుగా భావిస్తారు.

  Celebrations in Full Swing సందడిగా చైత్రోత్సవాలు
కూనంబందవలసలో కోలాటంతో సందడి చేస్తున్న గిరిజన మహిళలు

  • సంబరాల్లో గిరిపుత్రులు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : గిరిసీమల్లో ఇటుక పండుగ సందడి నెలకొంది. పార్వతీపురం, సాలూరు ఏజెన్సీలో ప్రాంతాల్లో సోమవారం ఈ వేడుకలు ఉత్సాహాంగా సాగాయి. ఈ పండుగను గిరిజనులు ఉగాది ( చైత్రోత్సవాలు) ఉత్సవాలుగా భావిస్తారు. వారసులకు వేట నేర్పడం, పితృదేవతలకు పూజించడం, కుటుంబ ఐక్యత చాటి చెప్పడం, సంస్కృతి, సంప్రదాయాలను తమ తరువాత తరం వారికి అవగహన కల్పించడమే ఈ పండుగ మూలసూత్రం. మన్యంలో అన్ని గిరిజన గ్రామాల్లో ఒకే రోజున ఈ పండుగను జరపాలనే నియమం లేదు. చైత్ర శుద్ధ పాడ్యమి తదుపరి తమ గ్రామపెద్ద నిర్ణయం మేరకు ఈ వేడుకలు జరుపుతారు. ముందుగా గ్రామానికి పాత చీపుర్లు, చెప్పులు, చేటలతో కట్టుకడతారు. దీని వల్ల గ్రామంలోకి దుష్టశక్తులు ప్రవేశించవని గిరిజనుల నమ్మకం. సాదారణంగా గురువారం నుంచి పండుగ ప్రారంభించి మంగళవారం ముగిస్తారు. అయితే వేట లభ్యం కాని పక్షంలో ఈ పండుగను పొడిగిస్తారు.

తొలిరోజున కుటుంబాల వారీగా ( ఇంటి పేరు ఒకటిగా ఉన్న వంశస్థులు ) బియ్యం సేకరిస్తారు. గత ఇటుక పండగ తర్వాత వివాహాలు చేసుకున్న జంటలకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. రెండో రోజు కొత్త మామిడితో పచ్చడి చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. పితృదేవతలకు కొత్త దుస్తులు చూపి మూలన మడపాలు ( అన్నం,కూర తదితర ఆహార పదార్థాలతో ) పెట్టి పూజిస్తారు. కోడిని సైతం మొక్కుబడిగా చెల్లిస్తారు. మూడో రోజు నేల తల్లికి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా థింసా, తమ సంస్కృతికి సంబంధించిన నృత్యాలు చేసి అంతా సంతోషంగా గడుపుతారు. నాలుగో రోజు ఇటుక పండుగ చేస్తారు.

ఈ సందర్భంగా తొలుత గోనస వేట చేస్తారు. దానిని ఽథింసా వాయిద్యాలతో గ్రామాల్లో ఊరేగిస్తారు. తమ గ్రామదేవత ( ఒక్కో గ్రామానికి ఒక్కొ పేరుతో గ్రామదేవత ఉంటుంది. )లకు పూజలు చేస్తారు. అనంతరం గోనస పూజకు స్వస్తి చెప్పి.. వేటకు వేళ్లే వారి కోసం బియ్యం, డబ్బులు, ఇతర సామగ్రిని సేకరిస్తారు. ఐదో అడవి తల్లికి పూజలు చేసి.. నైవెద్యంగా కోడిని వదిలి పెడతారు. ఆరో రోజు గ్రామంలో పురుషులు వేటకు బయలుదేరుతారు. వేటకు వెళ్లిన వారు ఏదైన జంతువుతో ( కనీసం కుందేలు ) తిరిగి వచ్చే వరకు మహిళలు దుస్తులు ఉతకరు. వాకిళ్లు ఊడ్చరు. పనులకు కూడా వెళ్లరు. ఉదయం తొమ్మిది గంటల తదుపరి బోరింగ్‌ కూడా కొట్టరు. వేటకు వెళ్లని వారు సైతం ఎటువంటి పనులకు వెళ్లరు. ఉద్యోగులు మాత్రం గ్రామకట్టుబాటు ప్రకారం జరిమానా చెల్లించి విధులకు వెళ్తారు. కొందరు సమీప పట్టణాలకు వెళ్లిన థింసా నృత్యాలు చేస్తూ సుంకం వసూలు చేస్తుంటారు. రహదారుల్లో టోల్‌గేట్‌లా కర్ర అడ్డం పెట్టి వాహనాలను నిలుపుతున్నారు. వాహనదారులు సంతోషంగా ఇచ్చిన సుంకం తీసుకుని గ్రామస్థులంతా సరదా చేసుకుంటారు. వేటకు వెళ్లిన వారు సకాలంలో తమకు దొరికిన జంతువులో తిరిగి వస్తే దానిని అంతా సమానంగా పంచుకుంటారు. పండుగ జరిగే రోజుల్లో పలువురు మడ్డికల్లు తాగుతారు. మొత్తంగా గిరిపుత్రులు ఆనందోత్సాహాలతో చైత్రోత్సవాలు జరుపుకుంటారు.

గిరిజన సంస్కృతికి ప్రతీక

ఇటుక పండుగ గిరిజన సంస్కృతికి ప్రతీక. ఈ పండుగ వల్ల గిరిజన సంప్రదాయాలు, బాధ్యతలను తెలుసుకోవడానికి వీలుంటుంది. పితృదేవతలకు, జీవన విధాన ఆచారాలకు చెందిన ఈ ఉత్సవంపై గిరిజనులంతా ఆసక్తి చూపుతారు.

- జయసింహా, ఆదివాసి వికాస్‌ పరిషత్‌ జిల్లా కార్యదర్శి, కొత్తవలస, సాలూరు మండలం

===============================

అనుబంధాలు పటిష్ఠం

మా పూర్వీకులు ఎలా జీవించారో ఈ పండుగ తెలుపుతుంది. ఈ వేడుకలతో గిరిజనుల్లో ఐక్యత, అనురాగాలు, కుటుంబాలు, గ్రామస్థుల మధ్య అనుబంధాలు పటిష్ఠమవుతాయి.

- కుంబి లచ్చమ్మ, పనసలపాడు, పాచిపెంట మండలం

Updated Date - Apr 07 , 2026 | 12:22 AM