Share News

Chain Snatching లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. చైన్‌ స్నాచింగ్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:39 PM

Chain Snatching Under the Pretext of Offering a Lift బైక్‌పై లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. గత కొన్నేళ్లుగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Chain Snatching   లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. చైన్‌ స్నాచింగ్‌
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

  • సుమారు రూ.29 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం

  • సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పట్టుకున్నాం: ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): బైక్‌పై లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి.. గత కొన్నేళ్లుగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు.

పార్వతీపురం పట్టణంలోని చాకలి బెలగాం ప్రాంతానికి చెందిన కొయ్యపు గిరి రాజశేఖర్‌ బైక్‌ మెకానిక్‌గా జీవనం సాగిస్తుండేవాడు. అయితే చెడు వ్యసనాలు, బెట్టింగ్‌ల కారణంగా అప్పులపాలయ్యడు. దీంతో పల్లెల్లో ఒంటరి, వృద్ధాప్య మహిళలలే లక్ష్యంగా చేసుకుని.. చైన్‌ స్నాచింగ్‌కు అలవాటుపడ్డాడు. లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి .. బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లి.. పరారయ్యేవాడు. జిల్లాలో సీతానగరంలో 3, బలిజిపేటలో 1, వీరఘట్టంలో 4, గరుగుబిల్లిలో 2, చిరమేరంగిలో 2, పాలకొం డలో 2 చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2024లో 5, 2025లో 7, 2026లో 2 కేసులు నమోదయ్యాయి. కాగా కొన్నాళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజశేఖర్‌పై పోలీసులు నిఘా పెట్టారు. కొన్ని రోజుల కిందట నిందితుడి ఫొటో, వాహనాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కాగా బుధవారం ఉదయం సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులకు ముందస్తుగా సమాచారం అందింది. సీతానగరం పోలీస్‌లు వాహనాల తనిఖీ చేస్తుండగా పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రాజశేఖర్‌ను పార్వతీపురం రూరల్‌ సర్కిల్‌ పోలీసులు, ఎస్బీ, ఐటీ కోర్‌, క్రైమ్‌ బృందాలు గుర్తించాయి. ఈ మేరకు చాకచాక్యంగా వ్యహహరించి.. నిందితుడిని పట్టుకుని విచారించాయి. నిందితుడు నేరం అంగీకరించడంతో ఆయన నుంచి సుమారు రూ.29 లక్షల విలువైన 192 గ్రాముల 16 బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు వెంకటేశ్వరరావు, మనీషారెడ్డి, ఎస్బీ సీఐ రమణమూర్తి, సీఐ రంగనాథం, ఏఆర్‌ ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఎస్‌ఐలు సింహాచలం, రాజేష్‌, హేమలత, క్రైమ్‌ బ్రాంచ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 11:39 PM