Certificate if paid డబ్బులిస్తే సర్టిఫికెట్
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:27 AM
Certificate if paid ఘోషాసుపత్రిలో కొత్త తరహా అవినీతి జరుగుతోంది. బర్త్ సర్టిఫికెట్లలో పేర్ల సవరణ కోసం వచ్చేవారిని మామూళ్లు అడుగుతున్నారు. డబ్బులిస్తే పని వేగంగా జరుగుతుందని, లేకుంటే చెప్పలేమని కిందిస్థాయి ఉద్యోగి ఒకరు తెగేసి చెబుతున్నాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా మళ్లీ మళ్లీ తిరిగే సమయం లేక వారు అడిగింది ముట్టజెబుతూ పని చేయించుకుంటున్నారు.
డబ్బులిస్తే సర్టిఫికెట్
ఘోషాసుపత్రిలో కిందిస్థాయి ఉద్యోగి చేతివాటం
ముట్టజెప్పకుంటే కొర్రీలు
అవస్థలు పడుతున్న పిల్లల తల్లిదండ్రులు
ఘోషాసుపత్రిలో కొత్త తరహా అవినీతి జరుగుతోంది. బర్త్ సర్టిఫికెట్లలో పేర్ల సవరణ కోసం వచ్చేవారిని మామూళ్లు అడుగుతున్నారు. డబ్బులిస్తే పని వేగంగా జరుగుతుందని, లేకుంటే చెప్పలేమని కిందిస్థాయి ఉద్యోగి ఒకరు తెగేసి చెబుతున్నాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా మళ్లీ మళ్లీ తిరిగే సమయం లేక వారు అడిగింది ముట్టజెబుతూ పని చేయించుకుంటున్నారు.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
గంట్యాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి పేరు బర్త్ సర్టిఫికెట్‌లో తప్పుగా నమోదైందని, సవరణ కోసం ఏం చేయాలో తెలియడం లేదని ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారులు అతనిని నగరపాలక సంస్థలో జనన, మరణ నమోదు కేంద్రానికి వెళ్లమన్నారు. అక్కడికి వెళితే ఘోషాసుపత్రిలోని ఇన్‌పేషెంట్ రిజిస్ట్రేషన్, రికార్డుల విభాగంలో సంప్రదించాలన్నారు. చివరికి బాధితుడు ఆసుపత్రిలోని ఆ విభాగానికి వెళ్లగా అక్కడున్న కిందిస్థాయి ఉద్యోగి పని కావడానికి అడ్డదారి చెప్పాడు. ‘పేరు సవరణ కావాలంటే వైద్యుల చుట్టూ తిరిగి సంతకాలు చేయించుకోవాలి. అవన్నీ పూర్తికావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుంది. అదే రూ.500 ఇస్తే నీ పని క్షణాల్లో అయిపోతుందని’ రూట్ క్లియర్ చేశాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధితుడు అడిగినంత ముడుపు సమర్పించాడు.
ఫ మరో గ్రామానికి చెందిన మహిళ తన కుమార్తె బర్త్ సర్టిఫికెట్‌లో పేరు సవరణ కోసం ఘోషాసుపత్రికి వచ్చింది. ఆమెను కూడా నిబంధనల పేరుతో భయపెట్టిన ఆ ఉద్యోగి రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఆ మహిళ కూడా అడిగినంత ఇచ్చి సర్టిఫికెట్ పొందింది.
నవజాత శిశువుల జనన ధ్రువీకరణ పత్రాల్లో పేర్లలో తప్పులు దొర్లినా.. ఇతర తప్పులను సవరించుకోవాల్సి వచ్చినా.. సామాన్యులకు నరకమే. పని కోసం వచ్చేవారితో అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి డబ్బుల బేరానికి దిగుతున్నాడు. పని చేయాల్సింది పోయి, ముట్టజెప్పనిదే ముందడుగు పడదన్న చందంగా ఆ వ్యక్తి వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. సర్టిఫికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లలో మార్పుల కోసం వచ్చే వారికి ఆ ఉద్యోగి నరకం చూపిస్తున్నాడు. డాక్టర్లు చుట్టూ తిరిగి సంతకాలు తీసుకుని రావాల్సి ఉంటుందని, పాత రికార్డులు వెతకడం చాలా కష్టమని లేనిపోని కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నాడు. ఇదే పనికి డబ్బులు ముట్టజెబితే నిమిషాల్లో చేస్తుండడం గమనార్హం.
ఫ పిల్లలను స్కూళ్లల్లో చేర్పించే సమయంలో బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. అందులో పేరు లేదా తేదీ తప్పు ఉంటే ఆడ్మిషన్ నిరాకరిస్తారు. దీంతో తల్లిదండ్రులు ముందుగానే సవరించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆ పిల్లలు పుట్టిన ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంది. ఘోషాలో పుట్టిన పిల్లల రికార్డులను ఆన్‌లైన్ చేసే సిబ్బంది చేసే తప్పుల వల్ల సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిజిటల్ రికార్డుల్లో తప్పులు సరిదిద్దడం సాంకేతికంగా పెద్ద ప్రక్రియ అంటూ బయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. సర్టిఫికెట్ సవరణకు ఏయే పత్రాలు కావాలన్న సమాచారాన్ని నోటీస్ బోర్డులపై స్పష్టంగా పేర్కొనడం లేదు. ఈ అస్పష్టతను వాడుకుని ఆ కాగితం లేదు ఈ అఫిడవిట్ బాగాలేదంటూ దరఖాస్తుదారులను మానసిక వేధింపులకు గురిచేస్తూ చివరకు అడిగినంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, విచారణ జరిపి ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామన్నారు.