నేరడిని సందర్శించిన కేంద్ర కమిటీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:40 PM
మండలంలోని నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంతో పాటు కాట్రగడ వద్ద సైడ్ వియ్యర్‌ను కేంద్ర జల సంఘం మానిటరింగ్ కమిటీ బృందం గురువారం సందర్శించింది.
భామిని, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నేరడి బ్యారేజీ నిర్మాణ ప్రాంతంతో పాటు కాట్రగడ వద్ద సైడ్ వియ్యర్‌ను కేంద్ర జల సంఘం మానిటరింగ్ కమిటీ బృందం గురువారం సందర్శించింది. కమిటీ చైర్మన్, సీడబ్ల్యూసీ చైర్మన్ జి.నాగమోహన్ నేతృత్వంలో సభ్యులు ఒడిశా సీఈ అరుణ్‌పాల్, నార్త్‌కోస్ట్ (విశాఖ) సీఈ శేషుబాబు, సీడబ్ల్యూసీ సీఎస్ ఆదిత్యశర్మ, ఎస్‌ఎస్‌మూల్, వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ రామచంద్రరావు నేరడి ప్రాంతానికి వెళ్లి వంశధార నదిలో పాతిన జెండాలను గుర్తించారు. అనంతరం ప్రస్తుతం ఫేజ్-2, స్టేజ్-2 ద్వారా కాట్రగడ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు వరదనీరు మళ్లించే ప్రాంతాన్ని పరిశీలించింది. సైడ్ వీయర్ వద్ద ఇసుక మేటను గుర్తించి, ఒడిశా సీఈ అరుణ్‌పాల్ పలు సందేహాలు ప్రస్తావించారు. వంశధార అధికారులు ఆయన అనుమానాలను నివృత్తి చేశారు. కాట్రగడ నుంచి నది అవతల ఒడిశావైపు ముంపు ప్రస్తావనపై కూడా సమీక్షించారు. చైర్మన్ నాగమోహన్ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించగా వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు, సైట్ ఇంజనీర్ ప్రభాకర్ తదితరులు వారికి వివరించారు. ఒడిశా అంతర రాష్ట్ర జలవనరులు విభాగానికి చెందిన సీనియర్ ఇంజనర్లతో పాటు వంశధార ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.