Share News

Census should be comprehensive జనాభా గణన సమగ్రంగా ఉండాలి

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:51 PM

Census should be comprehensive జనాభా గణన సమగ్రంగా ఉండాలని, శిక్షణలో ప్రతి అంశంపై నిశితంగా అవగాహన కలిగించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని జనాభా గణన ఆపరేషన్‌ రాష్ట్ర సంచాలకుడు జె.నివాస్‌ సూచించారు

Census should be comprehensive  జనాభా గణన సమగ్రంగా ఉండాలి
మాట్లాడుతున్న సంచాలకుడు నివాస్‌

జనాభా గణన సమగ్రంగా ఉండాలి

శిక్షణలో ప్రతి అంశాన్నీ తెలుసుకోవాలి

ప్రతి ఇంటిని, వ్యక్తినీ నమోదు చేయాలి

సెన్సస్‌ ఆధారంగానే రాష్ట్రానికి నిధులు

జనాభా గణన ఆపరేషన్స్‌ సంచాలకుడు నివాస్‌

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి):

జనాభా గణన సమగ్రంగా ఉండాలని, శిక్షణలో ప్రతి అంశంపై నిశితంగా అవగాహన కలిగించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని జనాభా గణన ఆపరేషన్‌ రాష్ట్ర సంచాలకుడు జె.నివాస్‌ సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న జనాభా గణనపై శిక్షణలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా లెక్కల నమోదు చాలా ముఖ్యమైన కార్యక్రమమని, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల కేటాయింపునకు జనాభా లెక్కల వివరాలు కీలకమని తెలిపారు. ఈ వివరాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తాయని, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ సంస్థలు సైతం జనాభా డేటా ఆధారంగా మన దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తాయన్నారు. ముందుగా ప్రజలకు జన గణనపై అవగాహన కల్పించాలన్నారు.

రెండు దశల్లో గణన

జనాభా లెక్కల నమోదు కార్యక్రమం రెండు దశలలో జరుగుతుందని, మొదటి దశల్లో బ్లాకుల వారిగా గృహాల లెక్కింపు జరుగుతుందన్నారు. రెండవ దశలో జనాభా లెక్కలు సేకరించాలని, ఈ ప్రక్రియ వచ్చే ఏడాదిలో జరుగుతుందని నివాస్‌ అన్నారు. శిక్షణ కాలంలో ప్రతి అంశాన్నీ కూలంకుషంగా అర్థం చేసుకోవాలని, ప్రశ్నావళిలో రూపొందించిన 33 ప్రశ్నలకు సరైన వివరాలు నమోదు చేయాలని అన్నారు. ప్రతి ఇంటినీ, ప్రతి వ్యక్తి వివరాలూ నమోదు చేయాలన్నారు. జనాభా గణన సందర్బంగా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. సమాచారాన్ని బహిరంగపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలతో స్నేహ పూర్వకంగా మసులుకోవాలని, సమాచారం సేకరణలో ఓర్పుతో వ్యవహరించాలని అన్నారు. అనంతరం జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ గతంలో జనాభా లెక్కింపు కార్యక్రమం మాన్యువల్‌గా జరిగేదని, ఈ సారి మొత్తం ప్రక్రియ ఎలాక్ర్టానిక్‌ విధానంలో జరుగుతుందన్నారు. గణన జరిగిన వెంటనే వివరాలను అప్‌లోడ్‌ చేయడం ముఖ్యమన్నారు. తర్వాత దశలో ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర భారతీయ జనగణన సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ సాయి శేఖర్‌, డీఆర్‌వో సత్తిబాబు, సీపీవో బాలాజీ, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రాఘవస్వామి పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 11:51 PM