Celebrate.. సంబరంగా..
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:21 AM
Celebrate.. : టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ఉత్సాహంగా పాల్గొన్న శ్రేణులు
ఎన్టీఆర్‌కు ఘన నివాళి
కార్యకర్తలే టీడీపీకి బలం: మంత్రి సంధ్యారాణి
సాలూరు, మార్చి29(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. పార్టీ కార్యా లయాల వద్ద టీడీపీ జెండా ఎగురవేశారు. కేకులు కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. సీనియర్ నేతలను సత్కరించారు. సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ నుంచి కోలాటం, తప్పెటగుళ్లు, థింసా నృత్యాలతో ఊరేగింపుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం జంక్షన్‌కు చేరుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్న సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తల ను దుశ్శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత భారీ స్ర్కీన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మున్సిపల్ పాలకపక్షం అడ్డు తగలడంతో ఇన్నాళ్లు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. అయితే ఈ అంశంపై వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్తామనడం హాస్యాస్పదంగా ఉంది. తప్పుడు కేసులు పెట్టి.. అన్నా క్యాంటీన్ తెరవకుండా చేయడం దారుణం.’ అని తెలిపారు. వైసీపీ నాయకుల్లా విగ్రహాలను ధ్వంసం చేసే సంస్కారం తమకు లేదన్నారు. ఇటీవల పట్టణంలో వంద పడకల ఆసుపత్రి భవనాన్ని తాము ప్రారంభిస్తే.. అది కూడా వారే కట్టించారని చెప్పడం సిగ్గుచేటన్నారు. కాగా టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. దొంగ నాటకాలు ఆడితే తన గుమ్మం తొక్కవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్ సూర్యనారాయణ , నాయకులు వేణుగోపాలనాయుడు, యుగంధర్, పరమేశు, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.