Share News

Illegal Transport అక్రమ రవాణాకు యత్నించి.. అడ్డంగా దొరికిపోయి..

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:25 PM

Caught Red-Handed While Attempting Illegal Transport జిల్లాకేంద్రం పార్వతీపురంలో సోమవారం వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని అంచనా. కాగా ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

 Illegal Transport అక్రమ రవాణాకు యత్నించి..  అడ్డంగా దొరికిపోయి..
కేసు వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్పీ

  • పార్వతీపురంలో వేర్వేరు చోట్ల తనిఖీలు

  • సరుకుతో దొరికిపోయిన ఐదుగురు నిందితులు

  • వాటి విలువ సుమారు రూ.46 లక్షలు

  • కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మనీషారెడ్డి

బెలగాం, మార్చి2(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురంలో సోమవారం వేర్వేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని అంచనా. కాగా ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ మనీషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోలీసులకు అందిన సమాచారం మేరకు పార్వతీపురం ఫ్లైఓవర్‌ కింద వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు గోనె సంచులతో కనిపించడంతో వారిని పట్టుకుని సోదాలు చేశారు. అయితే ఆ సంచుల్లో తొమ్మిది గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు ఎస్‌ఐ ప్రయోగమూర్తి గుర్తించారు. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్‌, చందన కుమార్‌, విశాఖకు చెందిన ఉమేష్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిను పట్టణంలోనే ఒక లాడ్జిలో ఉంచి కొద్దికొద్దిగా ఇతర రాష్ర్టాలకు వారు తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. కాగా నిందితుల నుంచి 90 కేజీల గంజాయి, రెండు మొబైల్స్‌, రూ.3,500ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టణంలోని డంపింగ్‌యార్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా.. ఒడిశా నుంచి స్కూటీపై వస్తున్న ముగ్గురిని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అయితే స్కూటీ డిక్కీలో 2.12 కేజీల గంజాయి ఉండడంతో నిందితులు పశ్చిమబెంగాల్‌కు చెందిన రూబెల్‌షేక్‌, సాహరుల్‌ షేక్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది. మొత్తంగా ఒకేరోజు రెండు కేసుల్లో సుమారు రూ.46 లక్షల విలువైన 92 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్టు ఏఎస్పీ తెలిపారు.

Updated Date - Mar 02 , 2026 | 11:25 PM