Caught After Five Years.. ఐదేళ్ల తర్వాత దొరికాడు..
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:24 AM
Caught After Five Years.. ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి రవాణా చేస్తూ .. పరారైన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఐదేళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు.
రిమాండుకు తరలించిన పోలీసులు
సాలూరు, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి రవాణా చేస్తూ .. పరారైన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఐదేళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసుకు సంబంధించి సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ 2021, ఆగస్టు 27న సాలూరు మండలం జీగిరాం గ్రామ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒడిశా నుంచి ఆంధ్రా వైపు కారులో గంజాయితో వస్తున్న మల్కన్‌గిరి జిల్లా చిత్రకోట పంచాయతీ కడగుమాకి చెందిన సంజిత్ కారాతో పాటు మరో ఇద్దరు పోలీసులను చూసి వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఆ కారులో సోదాలు చేయగా.. అప్పట్లో సుమారు 155 కేజీల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి సంజిత్ కారా కోసం గాలిస్తున్నారు. కాగా శనివారం నిందితుడు ఒడిశా నుంచి ఆంధ్రాకు బైక్‌పై వస్తుండగా.. సాంకేతిక సాయంతో జీగిరాం వద్ద రూరల్ పోలీసులు సంజిత్ కారాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పట్లో పరారైన మరో ఇద్దరిలో సమీరా కొరా చనిపోయినట్లు తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నాం. మొత్తంగా గంజాయి, కారు, బైక్ విలువ రూ.21 లక్షలు ఉంటుంది.’ అని తెలిపారు. గంజాయి కేసులకు సంబంధించి ఆలస్యమైనా నిందితుల అరెస్టు తప్పదని ఆయన చెప్పారు.