Share News

Caste Census Underway in Full Swing జోరుగా కుల గణన

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:25 AM

Caste Census Underway in Full Swing జిల్లాలో ఓటర్ల కుల గణన జోరందుకుంది. కచ్చితమైన సమగ్ర సమాచార సేకరణలో పంచాయతీ అధికారులు, సిబ్బంది బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు, షెడ్యూల్‌ ప్రాప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. కాగా పూర్తిస్థాయి కుల గణన ఓటర్ల జాబితా సెప్టెంబరు 7 నాటికి సిద్ధం కానుంది.

Caste Census Underway in Full Swing  జోరుగా కుల గణన
గడసింగుపురంలో ఓటరు జాబితాను అందిస్తున్న ఎంపీడీవో హరిప్రసాద్‌

  • పకడ్బందీగా నివేదిక తయారుచేస్తాం : డీపీవో

జియ్యమ్మవలస, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటర్ల కుల గణన జోరందుకుంది. కచ్చితమైన సమగ్ర సమాచార సేకరణలో పంచాయతీ అధికారులు, సిబ్బంది బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలు, షెడ్యూల్‌ ప్రాప్తికి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. కాగా పూర్తిస్థాయి కుల గణన ఓటర్ల జాబితా సెప్టెంబరు 7 నాటికి సిద్ధం కానుంది. జిల్లాలో పాలకొండ, పార్వతీపురం డివిజన్ల పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. వాటి పరిధిలో 451 పంచాయతీలు, 4,128 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం పంచాయతీ అధికారుల లెక్క ప్రకారం 3,14,889 మంది పురుషులు, 3,28,882 మంది మహిళలు, 66 మంది ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం 6,43,837 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న వివరాల ప్రకారం పురుషుల కంటే మహిళా ఓటర్లే దాదాపు 14 వేల మంది అధికంగా ఉన్నారు. సదరు జాబితాను అనుసరించి పంచాయతీ కార్యదర్శులు, మినిస్టీరియల్‌ సిబ్బంది ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంటింటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా ఓటర్లను గుర్తిస్తున్నారు. తొలుత ఈ నెల 23, 24 తేదీల్లో జాబితాలోని పలు కులాల ఓటర్లను మార్కింగ్‌ చేస్తారు. 25న డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేసి పంచాయతీ నోటీసు బోర్డులో ఉంచుతారు. 26 నుంచి 28 వరకు ఓటర్లలో కులాలపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 2 వరకు విచారణ చేస్తారు. సెప్టెంబరు 3 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 7న కుల గణన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ‘ప్రభుత్వ నిబంధనల మేరకు కులాల ప్రాతిపదికన ఓటర్ల జాబితా తయారీకి పకడ్బండీగా విచారణ చేస్తాం. తప్పులు లేని కుల గణన నివేదికను తయారు చేస్తాం.’ అని డీపీవో ఎస్‌.రవీంద్ర తెలిపారు.

Updated Date - Aug 23 , 2026 | 12:25 AM