టీటీడీకి మన్యం జీడిపప్పు
ABN , Publish Date - May 23 , 2026 | 11:13 PM
పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తిరు మల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు సరఫరా చేసేందుకు అడుగులు పడుతు న్నాయి.
- సరఫరా చేసేందుకు అడుగులు
- ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించిన దేవస్థానం అధికారులు
- నాణ్యతపై సంతృప్తి
పార్వతీపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తిరు మల తిరుపతి దేవస్థానానికి జీడిపప్పు సరఫరా చేసేందుకు అడుగులు పడుతు న్నాయి. ఈ మేరకు పార్వతీపురం మార్కె ట్ యార్డులో మహిళా సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను టీటీడీ జనరల్ మేనేజర్ ఉమాశంకర్, టెక్నికల్ అధికారి ఉషారాణితో కూడిన బృందం శనివారం సందర్శించింది. జీడి పప్పు సరఫరా తదితర విషయాలను ఐటీడీఏ ఏపీవో మురళీధర్ టీటీడీ బృందానికి వివరిం చారు. తమకు రోజుకు 3,500 కిలోల జీడిపప్పు వినియోగం ఉంటుందని, జిల్లా నుంచి ఎంత సరఫరా జరుగుతుంది తదితర అంశాలపై ఏపీవోతో టీటీడీ అధికారులు చర్చించారు.
జీడికి మంచి రోజులు
మన్యం జిల్లాలో సుమారు 50 వేల ఎకరా లకు పైబడి జీడితోటలు ఉన్నాయి. అయినప్ప టికీ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులకు జీడి పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితి గిరిజ నులకు ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత పార్వతీపురంలోని మార్కెటింగ్ యార్డులో జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. దీన్ని ఐటీడీఏ ఆధ్వర్యంలో డాక్రా మహిళా సంఘాల ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన జీడిపప్పును ఇక్కడి నుంచి సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నించడం శుభపరిణామం. టీటీడీ అధికారులు స్వయంగా వచ్చి ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించడంతో పాటు జీడి పప్పు నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జీడి పప్పును తీసుకుంటామని వారు హామీనిచ్చారు.
మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు..
తిరుమల దేవస్థానానికి ప్రతిరోజూ 3,500 కిలోల జీడిపప్పు అవసరం. ఈ పప్పును ఇతర దేశాల నుంచి టీటీడీ అధికంగా దిగుమతి చేసు కుంటుంది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇకనుంచి స్థానికంగా లభ్యమయ్యే జీడిపప్పును తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సేకరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందు లో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో పండించిన జీడిపప్పు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్ప డింది. దీంతో మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లాలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.