కార్మికుడి మృతిపై కేసు నమోదు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:07 AM
తన భర్త అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని భార్య చింతాడ లక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు శనివారం తెలిపారు.
కొత్తవలస, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తన భర్త అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని భార్య చింతాడ లక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన చింతాడ గౌరినాయుడు(45).. కంటకాపల్లి పంచాయతీలోనున్న శారడా మెటల్స్ అండ్ అల్లాయిస్ కర్మాగారంలో చిన్నారావు అనే కాంట్రాక్టర్ వద్ద రాళ్లు కొట్టే కార్మికునిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఒంట్లో నలత గా ఉందని చెట్టు కింద వాంతులు చేసుకోగా.. తోటి కార్మికులు వెంటనే కొత్తవలసలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌరినాయుడు అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.