care less officers to itukabatti ‘బట్టి’ంచుకోవట్లే!
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:00 AM
care less officers to itukabatti ఇటుక బట్టి నుంచి వచ్చిన వేడికి మాడిపోయిన చింత చెట్టుది. శృంగవరపుకోట నుంచి జామి వెళ్లే రోడ్డులో ఈ చెట్టు ఉంది. ఎస్.కోట నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో వయా ధర్మవరం, జామిలో అడుగడుగునా ఈ ఇటుక బట్టీలు కనిపిస్తాయి.
‘బట్టి’ంచుకోవట్లే!
నిబంధనలు పాటించని ఇటుక బట్టీలు
అనుమతులు లేకుండా నరికేస్తున్న చెట్లు
అధికారుల నిర్లక్ష్యంతో పర్యావరణానికి నష్టం
ఇప్పటికే వాతావరణంలో ప్రమాదకర మార్పులు
ఏటా అధిక ఉష్ణోగ్రతల నమోదు
- ఇటుక బట్టి నుంచి వచ్చిన వేడికి మాడిపోయిన చింత చెట్టుది. శృంగవరపుకోట నుంచి జామి వెళ్లే రోడ్డులో ఈ చెట్టు ఉంది. ఎస్.కోట నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో వయా ధర్మవరం, జామిలో అడుగడుగునా ఈ ఇటుక బట్టీలు కనిపిస్తాయి. రోడ్డుకు కనీసం ఒకట్రెండు మీటర్ల దూరం కూడా ఉండదు. ఇటుక బట్టీల నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తోంది. ఒక్కోసారి దారి కూడా సరిగా కనిపించదు.
- ఎస్.కోట మండలంలోని ఓ కర్రకోత యంత్రం డిపో వద్ద పడి ఉన్న టేకు కలప ఇది. ఇక్కడ గుట్టలు, గుట్టలుగా ఉన్న ఒక్క కర్రపై కూడ నెంబర్ లేదు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా తెచ్చిన కలపే ఇదంతా. గమనించి అడిగే నాథుడు లేడు.
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల నిర్లక్ష్యానికి ఈ రెండు ఉదాహరణలు మాత్రమే. ఇదే పరిస్థితి ప్రతి చోటా ఉంది. కానీ ఏ అధికారీ ప్రశ్నించడం లేదు. ఇది వారి బాధ్యతగా గుర్తించడం లేదు.
శృంగవరపుకోట, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి):
వాతావరణ సమతూల్యతను కాపాడేందుకు నాటిన చెట్లను ఓ పక్క విచ్చలవిడిగా నరికేయడం, మరో పక్క ఇటుకను కాల్చేందుకు బట్టీల్లో వినియోగించడం జిల్లాలో సర్వసాధారణంగా మారింది. బట్టీల నుంచి వస్తున్న మంటలకు చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ దెబ్బతింటున్నాయి. మరోవైపు వేసవిలో బట్టీలకు సమీపం నుంచి ప్రయాణించే వారు ఆ వేడికి చాలా ఇబ్బంది పడుతుంటారు. రహదారికి కనీస దూరం పాటించకుండా నిర్వహిస్తున్నారు. రోడ్లకు ఆనుకుని ఇటుక బట్టీలు, అనుమతులు తీసుకోకుండా నరికేసిన కలప ఎక్కడికక్కడే కనిపిస్తున్నాయి. పర్యావరణానికి హాని చేస్తున్న వీటిపై చర్యలు ఉండడం లేదు. పెద్ద పెద్ద కర్ర దుంగలు, ధాన్యం పొట్టు, కర్రపొట్టుతో ఇటుకను కాల్చుతుండడంతో వాటి నుంచి వచ్చే పొగ కార్బన్‌డయాక్షైడ్‌ను విడుదల చేస్తోంది.
సమాధానం లేని ప్రశ్నలు
ఇటుక బట్టీలకు కలప ఎక్కడి నుంచి తెస్తున్నారు? వీటికి అనుమతులు ఉన్నాయా? బట్టీ నిర్వహణకు ఏఏ శాఖల అనుమతులు తీసుకున్నారు? జీఎస్టీ కడుతున్నారా? ఇటుకలు కాలేందుకు పెడుతున్న మంటతో విడుదలవుతున్న కార్బన్‌డయాక్షైడ్ పరిమాణమెంత? వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా? వ్యవసాయ భూమిలోనే ఇటుక బట్టి నిర్వహణ జరుగుతోందా? వంటి వివరాలు ఏశాఖ అధికారులను అడిగినా సమాధానం లేదు.
ఈ నిబంధనలు పాటిస్తున్నారా?
ఎండలు పెరుగుతుండడంతో చెరువుల్లో వున్న నీరంతా ఇంకుతోంది. ఇటిక బట్టీల నిర్వాహకులు మట్టిని తవ్వేపనిలో పడ్డారు. నిబంధనల ప్రకారం ఇటుకల బట్టీలను జనావాసాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. సాగుకు అనుకూలంగా లేని స్థలాన్ని లీజుకు తీసుకోవాలి. ఎకరం కంటే ఎక్కువ భూమిలో ఇటుక బట్టీల నిర్వహణకు పూనుకుంటే వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. వ్యవసాయ భూమిలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి, ఆపేసిన తరువాత ఆ భూమిలో వ్యవసాయం చేసుకొనేందుకు అనువుగా మార్పిడి జరగాలి. ఇటుకల తయారీకి వాడే మట్టిని అధికారుల అనుమతులతో తవ్వాలి. ఇటుకలను కాల్చేందుకు వాడే కలప సేకరణకు అనుమతులు తీసుకోవాలి. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి. ఇటుకను కలపతో కాల్చేటప్పుడు వస్తున్న పొగతో పాటు కార్బన్‌డయాక్షైడ్ ఎంత పరిమాణంలో విడదలవుతుందో పరీక్షలు చేయించాలి. పర్యావరణానికి నష్టం లేదన్న ధ్రువపత్రం పొందాలి. ఇటుక విక్రయించేందుకు జీఎస్టీ చెల్లించాలి. పని చేసే కార్మికులకు చట్టప్రకారం జీతాలు, ఇతర సదుపాయాలు కల్పించాలి. ఇవేమీ లేకుండానే ఇటుక బట్టీల నిర్వహణ సాగుతోంది.
- చెట్లు తొలగించేందుకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కర్రకోత యంత్రాలకు తరలించేముందే ప్రతి చెట్టుకు అటవీ శాఖ నెంబర్‌ను కేటాయిస్తుంది. ఈనెంబర్‌ను కోసేసిన కర్రపై నమోదు చేయాలి. ఇలా నెంబర్‌తో వచ్చిన కర్రతో పాటు అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు చూసిన తరువాతే కర్రకోత యత్రాల యజమానులు తీసుకోవాలి. కానీ జిల్లాలో ఏ కర్రకోత యంత్రం వద్దా ఇలాంటి పరిస్థితులు కనిపించవు.
పర్యావరణం దెబ్బతింటోంది
పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటడం అటుంచి విచ్చలవిడిగా వాటిని నరికేస్తున్నారు. కర్రకోత యంత్రాలకు తరలిస్తున్నారు. మరి కొందరు ఇటుక బట్టీలకు అమ్మేసుకుంటున్నారు. ఇటుక బట్టీలను కలప, ఇతర వస్తువులతో కాల్చుతుండడంతో దట్టమైన పొగ విడుదలవుతోంది. వాతావరణంపై ప్రభావం పడుతోంది. ఉష్ణోగ్రత పెరుగుతోంది. అనుమతులు లేకుండా చెట్లు నరికేస్తున్న వారిపై చర్యలు ఉండాలి.
- బొబ్బిలి రామకృష్ణ, జియో స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకుడు, శృంగవరపుకోట