Share News

Encroachments ఆక్రమణలు తొలగించలేరా?

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:49 PM

Can’t Encroachments Be Removed? పాలకొండ ప్రధాన రహదారిలోని ఆక్రమణల తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిన్న వర్షం కురిసినా పట్టణంలో మురుగునీరు రొడ్డెక్కుతోంది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

  Encroachments   ఆక్రమణలు తొలగించలేరా?
మంగళవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పాలకొండ ప్రధాన రహదారిపై నిలిచిన మురుగునీరు

  • నామమాత్రంగా చర్యలు

  • పాలకొండ ప్రధాన రహదారిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు

  • వర్షం పడితే రొడ్డెక్కుతున్న మురుగు

  • ప్రజలకు తప్పని అవస్థలు

పాలకొండ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రధాన రహదారిలోని ఆక్రమణల తొలగింపుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిన్న వర్షం కురిసినా పట్టణంలో మురుగునీరు రొడ్డెక్కుతోంది. మంగళవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏలాం జంక్షన్‌ నుంచి చెక్‌పోస్టు జంక్షన్‌ వరకు రహదారికి ఇరువైపులా ఆక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా మురుగు కాలువలపై సిమెంట్‌ దిమ్మలు వేసి.. వాటిపై షాపుల కట్టి కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో వర్షం పడితే చాలు.. మురుగునీరు ప్రధాన రహదారిపైకి చేరుతుంది. వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. రోజుల తరబడి ఆ నీరు అలానే నిల్వ ఉండడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. దుర్వాసన కారణంగా నిత్యం వేలాదిగా వచ్చే విద్యార్థులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారి గుండా ప్రయాణించడం కష్టసాధ్యంగా మారింది. ఆక్రమణల కారణంగా మరోవైపు రహదారి కుంచించుకుపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల వడమ జంక్షన్‌లో ప్రధాన రహదారి కాలువలపై సిమెంట్‌ పలకలను మాత్రమే తొలగించి నగర పంచాయతీ యం తాంగం చేతులు దులుపుకుంది. పూర్తిస్థాయిలో ఆక్రమణలను తొలగించకపోవడం, కాలువల్లో పూడికలను సైతం తొలగించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నగర పంచాయతీ వాసులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ కమిషనర్‌ నూకరాజును వివరణ కోరగా.. ఆక్రమణ దారులకు నోటీసులిచ్చాం. మురుగుకాలువల్లో పూడికల తొలగింపునకు చర్యలు చేపడుతున్నాం. ’ అని తెలిపారు.

Updated Date - Sep 09 , 2026 | 11:49 PM