Share News

Can't build a single house! ఒక్క ఇల్లూ కట్టలే!

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:14 AM

Can't build a single house! వైసీపీ పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదు. అప్పటి పాలకులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారే గానీ.. ఒక్కటి కూడా నిర్మించలేదు. ఆప్షన్‌-3 కింద తామే కట్టించి ఇస్తామంటూ రాక్రీట్‌ సంస్థకు అప్పగించినా ప్రయోజనం లేదు. ఆ సంస్థ మొక్కుబడిగా కొన్ని ఇళ్లకు పునాదులు వేసి చేతులు దులిపేసుకుంది.

Can't build a single house! ఒక్క ఇల్లూ కట్టలే!
గుంకలాం లేఅవుట్‌లో ఇళ్లు పరిస్థితి ఇదీ

ఒక్క ఇల్లూ కట్టలే!

ఆప్సన్‌-3 లబ్ధిదారులకు వైసీపీ మొండిచేయి

కూటమి ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్‌ విచారణ

రాక్రీట్‌ సంస్థ మోసంపై లబ్ధిదారుల ఫిర్యాదు

విజయనగరం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదు. అప్పటి పాలకులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారే గానీ.. ఒక్కటి కూడా నిర్మించలేదు. ఆప్షన్‌-3 కింద తామే కట్టించి ఇస్తామంటూ రాక్రీట్‌ సంస్థకు అప్పగించినా ప్రయోజనం లేదు. ఆ సంస్థ మొక్కుబడిగా కొన్ని ఇళ్లకు పునాదులు వేసి చేతులు దులిపేసుకుంది. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని గుంకలాం, కొండకరకాంలో 5,088 ఇల్లు మంజూరు కాగా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక దీనిపై విజిలెన్సు దర్యాప్తు జరిగింది. తాజాగా రాక్రీట్‌ సంస్థపై 102 మంది లబ్ధిదారులు వ్యక్తిగతంగా, 58 మంది సామూహికంగా జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి జి.మురళీమోహన్‌కు ఫిర్యాదు చేశారు.

- గుంకలాం, కొండకరకాం ప్రాంతంలో ఆప్షన్‌-3 కింద 5,088 ఇళ్లు నిర్మించాలని అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించి, రాక్రీట్‌ సంస్థకు కాంట్రాక్టు అందించింది. యూనిట్‌ కాస్ట్‌ కింద రూ1.8 లక్షలు నిర్ణయించింది. రాక్రీట్‌ సంస్థకు తొలి దశలో కొంత మొత్తాన్ని జమ చేసింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించే కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఇక్కడ భూమి చదును చేసి ఉన్నవి 4,358, పునాది స్థాయిలో 483, శ్లాబ్‌ స్థాయి వరకూ 170 ఉన్నాయి. 64 ఇళ్లకు మాత్రం శ్లాబ్‌ని పూర్తి చేశారు. పునాదుల నుంచి శ్లాబ్‌ స్థాయి కంటే తక్కువ పని జరిగినవి మరో 13 ఉన్నాయి. ఇలా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తికాని పరిస్థితి. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆప్షన్‌-3 కింద ఉన్న ఇళ్ల నిర్మాణంపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ ప్రారంభించింది. విజిలెన్స్‌ అధికారులు రాష్ట్రంలోని ఆప్షన్‌-3 కింద నిర్మాణం చేపట్టే జగనన్న కాలనీల్లో విచారణ నిర్వహించారు. గుంకలాం, కొండకరకాం గ్రామంలో కూడా విచారణ నిర్వహించి, నివేదిక సమర్పించారు. రాక్రీట్‌ సంస్థకు ఎంత మొత్తం చెల్లించారన్న దానిపై వివరాలు సమర్పించినట్లు తెలిసింది.

ఫిర్యాదులు అందాయి

జి.మురళీమోహన్‌, జిల్లా గృహనిర్మాణశాఖాధికారి, విజయనగరం

గుంకలాం, కొండకరకాం ప్రాంతంలో 2022లో రాక్రీట్‌ సంస్థ 5,088 ఇళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఒక్కటి కూడా పూర్తికాలేదు. దీనిపై వివిధ దశల్లో ఉన్న వాటి వివరాలను గృహనిర్మాణశాఖ అధికారులకు నివేదించాం. మరోవైపు 102 మంది లబ్ధిదారులు వ్యక్తిగతంగా, 58 మంది సామూహికంగా రాక్రీట్‌ సంస్థ తమకు ఇంటి నిర్మాణలు చేపట్టలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని త్వరలో జిల్లా కలెక్టరు రామసుందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాం.

Updated Date - Feb 12 , 2026 | 12:14 AM