Can you protect food quality? ఆహార నాణ్యతను కాపాడగలరా?
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:43 PM
Can you protect food quality? మారిన జీవనశైలితో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ టిఫిన్ లేదా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఫ్రై చేసే తినుబండారాలను ఇష్టపడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వాటిని తయారు చేస్తున్నారు.
ఆహార నాణ్యతను
కాపాడగలరా?
రెండు జిల్లాలకు ఇద్దరే పర్యవేక్షణ అధికారులు
ఆహార భద్రత శాఖలో అధికారులు, సిబ్బంది తీవ్ర కొరత
తూతూమంత్రంగా తనిఖీలు
నిబంధనలు పాటించని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు
ఇష్టారాజ్యంగా అమ్మకాలు
వాటినే తింటూ ఆరోగ్యం పోగొట్టుకుంటున్న ప్రజలు
మారిన జీవనశైలితో విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ టిఫిన్ లేదా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఫ్రై చేసే తినుబండారాలను ఇష్టపడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వాటిని తయారు చేస్తున్నారు. ముందురోజు ఉండిపోయిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి అమ్ముతున్నారు. వాటినే తింటూ ప్రజలు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నెలకోరోజు కూడా వాటిపై దృష్టిపెట్టడం లేదు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు కలిపి ఇద్దరు అధికారులుంటే వారు ఏం చేయగలరు? ఎప్పుడు తనిఖీలకు వెళ్లగలరు? జరిమానా వేసి వసూలు చేసే పరిస్థితి ఉంటుందా? నిరంతరం నిఘా పెట్టగలరా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
విజయనగరం, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి):
- గత నెల 26న బొండపల్లిలో హోటళ్లు, రెస్టారెంట్లను జిల్లా ఆహార నియంత్రణ అధికారి ఈశ్వరి నేతృత్వంలో సిబ్బంది తనిఖీలు చేశారు. సరిగ్గా లేని ఆహార పదార్థాలను అక్కడే పారబోశారు. పరిశుభ్రత, నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు జారీచేశారు. అయితే ఒక్క బొండపల్లిలో మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల తయారీలో కల్తీ రాజ్యమేలుతోంది. నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఎక్కడికక్కడే పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హోటళ్లు, కర్రీ పాయింట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందులో అనుమతి ఉన్నవి కొన్నే. తనిఖీ చేయాల్సిన అధికారులు రెండు జిల్లాలకు ఇద్దరే ఉన్నారు. విజయనగరంతో పాటు పార్వతీపురం మన్యానికి కలిపి జిల్లా ఆహార నియంత్రణ అధికారిగా ఈశ్వరి ఉన్నారు. భద్రతా అధికారిగా ఉన్న వెంకటరమణ మన్యానికి శాశ్వత అధికారి కాగా.. విజయనగరానికి ఇన్‌చార్జిగా ఉన్నారు.
ఆహార తయారీలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. రోడ్డు పక్కనే, మురుగు కాలువల చెంతనే ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్లను విక్రయిస్తున్నారు. బిర్యానీ, ఫ్రైడ్‌రైస్, చికెన్ పకోడీ, కబాబ్‌లు, నూడిల్స్‌ను ఆసక్తికరంగా తయారు చేస్తున్నారు. వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడుతున్నారు. రుచి, వాసన పెరిగేందుకు రకరకాల వస్తువులను వినియోగిస్తున్నారు. అనేక రంగులతో ఆకర్షణీయంగా తయారుచేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇవేమీ తెలియని వారు వాటిని తిని ఆరోగ్యానికి హానిని కొనితెచ్చుకుంటున్నారు. నోరూరించే రుచికరమైన ఆహారాలు తినేందుకు వెళ్తున్న వారు అనారోగ్యం బారిన పడుతున్నారు. లివర్, శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నియంత్రించాల్సిన ఆహార భద్రతా అధికారులు, మునిసిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పత్తా లేకుండా పోతున్నారు.
జిల్లాలో మూడు వేల వరకూ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అనుమతి ఉన్నవి కొన్నే. ఆహార భద్రతా అధికారుల లెక్కలు ప్రకారం కేవలం 1350 వరకూ అనుమతి పొందినవి. మిగతావి అనధికారికంగా ఏర్పాటు చేసినవే. వాస్తవానికి వీటికి లైసెన్స్ తప్పనిసరి. ఆహార పదార్థాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ మార్కుతో పాటు నాణ్యతా ప్రమాణాలు, ధర ముద్రించి విక్రయించాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. వీటికి సంబంధించి ఆన్‌లైన్‌లో సమాచారం తెలుసుకోవచ్చు. జిల్లా ఆహార నియంత్రణ సహాయ అధికారి కార్యాలయానికి నిర్దేశించిన రుసుంతో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు పరిశీలించిన తరువాత వీరికి లైసెన్స్ మంజూరు చేస్తారు. ఆహారం తయారు చేసేవారికి (కుక్‌లకు) ఆహారాల తయారీ ప్రమాణాలపై అవగాహన అవసరం. కానీ చాలామంది వృత్తిగా ఎంచుకున్న వారు కొద్దిరోజుల పాటు హోటళ్లలో పనిచేసి తరువాత ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా పెంచడంతో పాటు ఆహార తయారీపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. కర్రీ పాయింట్ల గురించి చెప్పనక్కర్లేదు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లో కర్రీ పాయింట్లు ఏర్పాటుచేసి సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థుల అవసరాలను టార్గెట్ చేసుకొని నాణ్యత లేని కూరలు, పప్పుతో పాటు ఇతర ఆహార పదార్థాలను అమ్ముతున్నారు. మద్యం దుకాణాల వద్ద తినుబండారాలు, ఆహార పదార్థాల విక్రయాలకు అనుమతి లేదు. కానీ ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం దుకాణాల చుట్టూ పాన్‌షాపుల మాదిరిగా ఇవి వెలుస్తున్నాయి.
సరిపడినంత సిబ్బంది లేరు
విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు ముఖ్య పట్టణాల్లో అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. తరువాత వదిలేస్తున్నారు. అడిగితే సిబ్బంది కొరతను షాకుగా చెబుతున్నారు. ప్రస్తుతం విజయనగరంతో పాటు పార్వతీపురం మన్యానికి కలిపి జిల్లా ఆహార నియంత్రణ అధికారిగా ఈశ్వరి ఉన్నారు. భద్రతా అధికారిగా ఉన్న వెంకటరమణ మన్యానికి శాశ్వత అధికారి కాగా.. విజయనగరానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 వేల మందికి ఒక ఆహార భద్రతా అధికారి ఉండాలి. ఈ లెక్కన ఒక్క జిల్లా కేంద్రంలోనే ఆరుగురు అవసరం. బొబ్బిలి, రాజాం, పార్వతీపురం మన్యం, సాలూరు, పాలకొండ, నెల్లిమర్లకు కనీసం ఇద్దరు చొప్పున నియమించాలి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఒక జిల్లా అధికారి, ఒక భద్రతా అధికారి మాత్రమే ఉన్నారు. సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు సైతం ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తనిఖీలు, కేసుల నమోదు అంతంతమాత్రమే. దీంతో ప్రజారోగ్యానికి తీరని భంగం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.
తనిఖీలు చేస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నాం. సీజ్ చేసేందుకు సైతం వెనుకడుగు వేయడం లేదు. గత ఏడాది 125 కేసులు నమోదు చేశాం. రూ.6 లక్షల వరకూ అపరాధ రుసుం విధించాం. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, ఆహారాన్ని కల్తీ చేసినా టోల్‌ఫ్రీ నంబర్ 18004253857కు కానీ.. 08645-297245 నంబరుకు కాని సంప్రదించాలి.
- ఈశ్వరి, ఆహారభద్రత, కల్తీ నియంత్రణ శాఖ అధికారి, విజయనగరం
-----------------